కోట శ్రీనివాసరావు మృతిపట్ల చంద్రబాబు, రేవంత్, కేసీఆర్, జగన్ సహా రాజకీయ ప్రముఖుల సంతాపం..

కోట శ్రీనివాసరావు మృతికి సినీ ప్రముఖులతోపాటు.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కోట శ్రీనివాసరావు మృతిపట్ల చంద్రబాబు, రేవంత్, కేసీఆర్, జగన్ సహా రాజకీయ ప్రముఖుల సంతాపం..

Kota Srinivasarao

Updated On : July 13, 2025 / 9:49 AM IST

Kota Srinivasa Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులతోపాటు.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కోట మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు అని చంద్రబాబు అన్నారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు. వారి మరణంతో సినిమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. స్వర్గస్తులైన కోటా శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కోట శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కోట కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ తెలిపారు.

కోట శ్రీనివాసరావు మృతిపట్ల ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లోకేశ్ తెలిపారు.