Praneeth Rao : ప్రణీత్‌రావ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరికి రిమాండ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు 14రోజుల రిమాండ్ విధించారు.

Praneeth Rao Case
Praneeth Rao Phone Tapping Case : ప్రణీత్‌రావ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులకు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, ఓ మీడియా ప్రతినిధికిపై లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యాయి. ఫోన్ టాపింగ్ కేసు నమోదుకాగానే ప్రభాకర్ రావు, రాధా కిషన్ లు చెన్నై మీదుగా అమెరికాకు వెళ్ళిపోయినట్లు, వారు అమెరికాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధా కిషన్ నివాసాల్లోకి పోలీసులు సోదాలు చేశారు. ఇద్దరికీ కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు.
Also Read : Praneeth Rao: ఆ బీఆర్ఎస్ నేత ఎవరు? ప్రణీత్ రావు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఆదివారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలోని నాంపల్లి మెజిస్ట్రేట్ కన్నయ్య లాల్ ఎదుట పోలీసులు వారిని హాజరుపర్చగా.. వారిద్దరికి 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్బీఐ లో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు, రాధాకిషన్ రావుతోపాటు ఓ మీడియా నిర్వాహకుడి ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.