President Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.

President Draupadi Murmu
President Hyderabad Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) హైదరాబాద్ రానున్నారు. అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraj) ( 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి నగరానికి వస్తున్నారు. మంగళవారం ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. సాయంత్రం 5గంటలకు హెలికాప్టర్ ద్వారా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు.అక్కడ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాల మళ్లింపు ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రత్యామ్యాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులను పోలీసులు కోరారు.