Ramanthapur Narayana College Incident Update : రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ఇంటర్ బోర్డు సీరియస్.. ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వార్నింగ్

హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీ విషయంలో నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చాలా సీరియస్‌గా పరిగణిస్తామని.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Ramanthapur Narayana College Incident Update : రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ఇంటర్ బోర్డు సీరియస్.. ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వార్నింగ్

Updated On : August 19, 2022 / 7:46 PM IST

Ramanthapur Narayana College Incident Update : హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. అవాంఛనీయ ఘటన నేపథ్యంలో నారాయణ కాలేజీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారని.. పోలీసు అధికారులు కాలేజీ లోపలి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా తెలిపామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా, ఘటనకు గల కారణాలను తెలపాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ ను ఆదేశించారు.

Hyderabad : నారాయణ కాలేజీలో ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి ఘటనలో బిగ్ ట్విస్ట్..!!

మరోవైపు ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. కోర్సు పూర్తి చేసుకుని కాలేజీ నుండి నిష్క్రమించే విద్యార్థుల సర్టిఫికెట్లను నిలుపుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చదువు పూర్తైనా విద్యార్థులకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను జారీ చేయడం కాలేజీ యాజమాన్యం బాధ్యత అని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు.

విద్యార్థులు జూనియర్ కాలేజ్ నుండి బయటకు వెళ్లే సమయంలో వాటిని నిలిపివేయవద్దని కూడా తెలియజేశారు. అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేయాలని, ఏ కళాశాల అయినా ఏ కారణంతోనైనా ఏ విద్యార్థి సర్టిఫికెట్లను నిలిపివేయకుండా చూసుకోవాలని జిల్లా అధికారులందరికీ సూచించింది బోర్డు.

Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు

ఇటువంటి ఫిర్యాదులు ఏవైనా సంబంధిత DIEO లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌కు అందించవచ్చంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీ విషయంలో నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చాలా సీరియస్‌గా పరిగణిస్తామని… అటువంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.