Ramoji Rao Funeral : ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలను రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించారు.

Ramoji Rao Last Rites
Ramoji Rao Last Rights: రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో అంత్యక్రియలను పూర్తిచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం నుంచి ఉదయం 9.30 గంటలకు రామోజీరావు పార్ధివదేహంతో అంతిమయాత్ర మొదలైంది. అమెరికా నుంచి వచ్చిన రామోజీరావు మనవడు సంజయ్, కుటుంబ సభ్యులు కడసారి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర వాహనంపై కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సృజనా చౌదరి, జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. రామోజీకి తుదివీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, రామోజీ అభిమానులు తరలివచ్చారు.
Also Read : రామోజీరావు అంత్యక్రియలు జరిగే స్థలం ఇదే.. వీడియో వైరల్
రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనం వద్ద తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరిగాయి. గాల్లోకి తుపాకులు పేల్చి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామోజీరావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్మృతివనం వద్దకు పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు రామోజీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. స్మృతివనం వద్ద చంద్రబాబు నాయుడు రామోజీరావు పాడెను మోసి ఘనంగా నివాళులర్పించారు.