ఎస్ఎల్‌బీసీ సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్..
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

SLBC Tunnel
SLBC Tunnel Incident: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ తదితర బృందాలు వారిని బయటకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు టన్నెల్లో 50గంటలకు పైగా సహాయక చర్యలు కొసాగుతున్నాయి. సహాయక బృందం తీవ్రంగా శ్రమించి టన్నెల బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్నాయి. బురదలో మరో 40 మీటర్లు ముందుకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండురోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోవటంతో అప్పటి నుంచి ఎనిమిది మంది టన్నెల్ లోనే చిక్కుకుపోయారు. అయితే, టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్లి బాధితుల పేర్లు పెట్టి పిలిచినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వారు చనిపోయి ఉంటారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైన వారికోసం బురదలోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. బురదలో కూడా వ్యక్తులను గుర్తించే పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. టన్నెల్ బోరింగ్ మిషన్ లో సేఫ్ కంటైనర్ ఉంటుందని, కార్మికులు సేఫ్ కంటైనర్ లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భావిస్తున్నారు. ఎలాగైనా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ర్యాట్ హోల్స్ మైనర్స్ ను రంగంలోకి దించింది.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దించింది. ఢిల్లీ నుంచి ఆరుగురు మైనర్లు ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించనున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41మంది కార్మికులు చిక్కుకోగా 17 రోజులు ప్రయత్నించినా వారిని అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకిదిగి ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ర్యాట్ హోల్ మైనింగ్ విధానం అంటే ఏమిటి..?
మేఘాలయ వంటి రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బోరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి.. భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విధానం. సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే హోల్ ఉంటుంది. కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే ఈ విధానంలో తవ్వకాలు చేపడతారు. రోప్ లు, నిచ్చెనల సాయంతో కొద్దికొద్దిగా తవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41మంది కార్మికులు చిక్కుకోగా 17 రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగితే ఆపరేషన్ విజయవంతం అవడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు.