SLBC Tunnel Mishap : లోపల భయంకరంగా ఉంది, అంత ఈజీ కాదు- SLBC రెస్క్యూ ఆపరేషన్‌పై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

SLBC Tunnel Mishap : లోపల భయంకరంగా ఉంది, అంత ఈజీ కాదు- SLBC రెస్క్యూ ఆపరేషన్‌పై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

Updated On : February 24, 2025 / 12:20 AM IST

SLBC Tunnel Mishap : ఆశలు అడుగంటుతున్నాయి. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు సజీవంగా వస్తారనే ఆకాంక్షలు ఆవిరి అవుతున్నాయి. గంటలు గడుస్తున్నా ప్రమాదం జరిగిన స్థలం చేరుకోవడానికి రెస్క్యూ టీమ్స్ కు వీలు కావడం లేదు. శిథిలాలను తొలగించేందుకు దారి కనిపించడం లేదు. 37 గంటలు దాటిన రెస్క్యూ ఆపరేషన్.. కార్మికుల సమాచారానికి సంబంధించి ఎలాంటి పురోగతిని సాధించలేదు.

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ లో చిక్కుకుపోయిన 8మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

కార్మికులను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు సహాయక చర్యలను దగ్గరుంచి పర్యవేక్షించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగించాలని సూచనలు జారీ చేశారు.

Also Read : విపరీతమైన బురద, నీరు.. తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్.. SLBC టన్నెల్ లో కార్మికులను కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు..

ఎస్ఎల్ బీసీ ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారాయన. లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావడం లేదని ఆయన వెల్లడించారు. 100 మీటర్లలోనే సమస్య ఉందని చెప్పారు. నీరు, బురద ఎక్కువగా ఉందన్నారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉందన్నారు మంత్రి జూపల్లి. నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకు వచ్చిందన్నారు.

ఇక టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రెస్క్యూ టీమ్స్ టన్నెల్ బోర్ మిషన్ కు చేరువగా వెళ్లాయని మంత్రి జూపల్లి తెలిపారు. కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని, రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

నీటి ప్రవాహం సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయడంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. టన్నెల్ లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటుకు చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సహాయక చర్యల్లో 130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్, 24 మంది హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు.

సొరంగంలో 14వ కిలోమీటర్ దగ్గర పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లగలిగిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అరకిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

టన్నెల్ లో 14వ కిలోమీటర్ దగ్గర 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది. షిప్పింగ్ బోట్లు, టైర్లు, చెక్క బల్లలు వేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బుదర స్థలాన్ని దాటితేనే ప్రమాదస్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి.