చకచకా ఆస్తుల గణన, Dharani portalలో ఆస్తుల నమోదు

Telangana Dharani portal లో ఆస్తుల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. వివరాల నమోదు కోసం.. ప్రభుత్వం నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ అప్‌డేషన్.. న్యాప్ అనే ప్రత్యేక యాప్ (AAP) ను అధికారులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఇంటి దగ్గరికి అధికారులు స్వయంగా వచ్చి వివరాలను, నిర్మాణ ఫొటోను తీసుకుని ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. యజమాని వివరాలతో పాటు కులం, నిర్మాణ వినియోగం, ఆస్తి సంక్రమించిన విధానంతో పాటు విద్యుత్, నీటి బిల్లుల సమాచారం సహా మొత్తం 52 అంశాలను సేకరిస్తారు. ప్రతి ఆస్తికీ ఆధార్ (Aadhar) లింక్ చేస్తారు.
సర్వే సమయంలో.. యజమాని తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. యజమాని అందుబాటులో లేకపోతే.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తారు. కిరాయిదారులుంటే వారి నుంచి యజమాని ఫోన్ నంబరు తీసుకుని అవసరమైన సమాచారం సేకరిస్తారు. ఫోన్‌లోనూ అందుబాటులోకి రాని యజమానుల కోసం.. మరికొన్నిరోజుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్ లింకును అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ఆస్తుల వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించే చాన్స్ ఉందని చెబుతున్నారు. కానీ.. దీనిపై స్పష్టత లేదు.
రాష్ట్రంలోని హైదరాబాద్ సహా ఇతర నగరాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కలిగిన నిర్మాణాల వివరాలను సేకరించే కార్యక్రమం మొదలైంది. అక్టోబరు 12లోపు పీటీఐఎన్ ఉన్న అన్ని ఆస్తుల వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తుల వివరాల సేకరణకు పర్యవేక్షకులను నియమించారు. రాష్ట్రంలోని జిల్లాలను 7 యూనిట్లుగా విభజించి.. వివరాలు సేకరిస్తున్నారు.
గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని నిర్మాణాలను నమోదు చేస్తారు. నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ అప్‌డేషన్ యాప్ పంచాయతీ కార్యదర్శులకూ అందుబాటులోకి వచ్చింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి రోజుకు 70 నిర్మాణాలను నమోదు చేయాలని టార్గెట్ పెట్టారు.
ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుకు.. యజమాని పేరు, కులం, ఇంటి నంబరు, చిరునామా, నిర్మాణ వినియోగం.. కమర్షియలా, రెసిడెన్షియలా అన్నది కూడా అడుగుతారు. ఆస్తి విస్తీర్ణం, ఆస్తి ఎలా వచ్చింది, ఆస్తిపన్ను మదింపు సంవత్సరం, భూమి.. ప్రైవేటు స్థలమా, అసైన్డ్ భూమా అన్న వివరాలు సేకరిస్తారు.
యజమాని ఫోటో, యజమాని ఆధార్ నెంబర్, పట్టాదారు పాసుపుస్తకం, వయసు, ఈ-మెయిల్ ఐడీ, విద్యుత్ కనెక్షన్ నెంబరు, వాటర్ కనెక్షన్ నెంబర్, ఓటర్ ఐడీ, ల్యాండ్ మార్క్, కుటుంబసభ్యుల వివరాలన్నీ సేకరిస్తారు. ఫోటో తీసుకోవడంపై అభ్యంతరం ఉంటే.. ఇంటి యజమాని తిరస్కరించవచ్చు.