మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోన్న రేవంత్ సర్కార్.. ఏం చేస్తోందంటే?
ఎలాంటి విధులు, నిధులు, అధికారాలులేని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవసరమా అన్న చర్చ కొత్తదేమి కాదు.
Revanth Reddy (Image Credit To Original Source)
- కార్పొరేషన్ల విభజనతో ఆలస్యంగా గ్రేటర్ ఎన్నికలు..!
- గ్రేటర్ కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు పెట్టే ప్లాన్…
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి
Revanth Reddy: తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు తెస్తారన్న టాక్ మొదలైంది. ఐదంచెల వ్యవస్థను..మూడంచెల లేదా నాలుగంచెల వ్యవస్థగా మారుస్తారన్న ప్రచారం ఉంది. ఎలాంటి అధికారాలు లేని, నయాపైస నిధులు ఖర్చు చేయలేని ఎంపీటీసీ, జడ్పీటీసీ పోస్టులు ఎందుకు అన్న చర్చ నడుస్తోంది.
పదవుల కోసం తీసుకొచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోస్టులు ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోతున్నాయని.. ఆ పదవులతో ప్రభుత్వానికి భారమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉన్న చర్చ. ఎలాంటి ఉపయోగం లేని ఆరో వేలు లాంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను తొలగిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చోపచర్చలు జరుపుతోందట రేవంత్ సర్కార్.
Also Read: కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు స్పీడప్ చేసిన కవిత.. ఆ నెలలోనే పార్టీ ప్రారంభం..! ఎందుకంటే?
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎలాంటి నిధులు, విధులు, అధికారాలు పెద్దగా ఉండవు. ఎంపీటీసీలు ప్రజలతో ఎన్నుకోబడి పరోక్ష పద్దతిలో ఎంపీపీని ఎన్నుకుంటారు. అయితే ఎలాంటి విధులు, నిధులు, అధికారాలు లేని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవసరమా అన్న చర్చ కొత్తదేమి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను తొలగిస్తారన్న ప్రచారం జరిగింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థతో ప్రభుత్వంపై భారం!
కార్యకర్తలకు పదవులకు కోసం తప్ప ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థతో ప్రభుత్వంపై భారం పడుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయ్. పంచాయతీ రాజ్ వ్యవస్థలో సర్పంచ్‌లు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్లే కీలకం. సర్పంచ్‌లతో ఎంపీపీ ఎన్నిక జరిగేలా మార్పులు చేయాలన్న ఆలోచన ఉందట. మరి జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఎలా అంటే ఎంపీపీలు..జడ్పీ ఛైర్మన్‌ను ఎన్నుకునేలా చట్ట సవరణ చేస్తే అయిపోతుందని భావిస్తున్నారట. లేకపోతే ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పోస్టుల కోసం డైరెక్ట్ ఎన్నికలు పెడితే..క్యాంపు పాలిటిక్స్‌కు చెక్ పెట్టొచ్చనేది కూడా మరొక ఆప్షన్ అంటున్నారు.
ఒకవేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ కోసం..సర్పంచ్, ఎంపీపీలను ఓటర్లుగా మార్చే ప్లాన్ ఉందంటున్నారు. అది అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ మధ్య ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అయితే ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదంటున్నారు.
ముందుగా.. పదవీకాలం పూర్తయ్యే మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. అంతలోపు గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్లుగా చేసి..ఏప్రిల్‌లో ఎలక్షన్స్‌కు వెళ్లే ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలనేది రేవంత్ సర్కార్ దగ్గరున్న లాస్ట్ ఆప్షన్ అంటున్నారు.
అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులను రద్దు చేస్తే..గ్రామ, మండల స్థాయి లీడర్లు నిరూత్సాహ పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఇది వచ్చే ఎన్నికల్లో తమకు మైనస్‌గా మారే ప్రమాదం ఉందని కూడా లెక్కలు వేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో అసలు ఎంపీటీసీ, జడ్పీటీసీ పోస్ట్‌లను ఉంచుతారా.? లేక ఆ పదవులు ఊస్టేనా.? యాజ్ టీజ్‌గా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా.? అనేది వేచి చూడాలి మరి.
