Revanth Reddy: సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. ఎందుకంటే?
చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి కేసీఆర్ దిగజారారని రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy
TPCC: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో లోపాలపై ప్రశ్నించారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా కొనసాగట్లేదని, దీన్ని పట్టించుకోకుండా కేసీఆర్.. సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు.
చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి కేసీఆర్ దిగజారారని రేవంత్ రెడ్డి తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచలేదని, అంతేగాక మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి వంట కార్మికులకు ఆర్థిక భారం, పనిభారం పెంచారని చెప్పారు. ఎన్నో పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవని అన్నారు.
చెట్ల కింద వంటలు కొనసాగుతున్న పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనివల్ల అక్కడక్కడ మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థకు గురైన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ ఇంత అధ్వానంగా ఉందని చెప్పారు. ఈ పరిస్థితులపై కనీసం సమీక్ష నిర్వహించడం లేదని విమర్శించారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.