Godavari Dry : డేంజర్ బెల్స్.. ఇసుక దిబ్బలు, బండ రాళ్లు.. మార్చిలోనే ఎడారిని తలపిస్తున్న గోదావరి..
ఈ ఏడాది మార్చి నెలలోనే గోదావరి నదిలో ఇసుక దిబ్బలు, బండరాళ్లు కనిపిస్తున్నాయి.

Godavari Dry : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతులు నమోదవుతున్నాయి. ఎండల ఎఫెక్ట్ తో భద్రాచలంలోని గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. సాధారణంగా వేసవి కాలంలో ఏప్రిల్ చివరి వారంలో గోదావరి నది ఎండిపోయి కనిపిస్తుంది. కానీ, ఈ ఏడాది మార్చి నెలలోనే గోదావరి నదిలో ఇసుక దిబ్బలు, బండరాళ్లు కనిపిస్తున్నాయి.
వర్షా కాలంలో గోదావరి ఉప్పొంగి ప్రవహించేది. భద్రాచలం పట్టణాన్ని ముంచెత్తిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి గోదావరి ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. ఎటు చూసినా ఇసుక మేటలు దర్శనం ఇస్తున్నాయి. ఇసుక ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో వాతావరణంలోని ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు.
Also Read : ఏప్రిల్ 3న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..! గవర్నర్‌తో సీఎం రేవంత్ కీలక భేటీ..
ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం పూర్తి స్థాయిలో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెంతో పాటు ములుగు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవిలో 50 డిగ్రీలకిపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులే ఇందుకు కారణం అంటున్నారు.