Salman Khan : తెలంగాణలో సల్మాన్ ఖాన్ బిజినెస్.. ఏకంగా రూ.10వేల కోట్ల పెట్టుబడులు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..
Salman Khan Ventures Telangana Project : సల్మాన్ ఖాన్‌కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో పదివేల కోట్లుతో ..
Salman Khan Ventures Telangana Project
Salman Khan Ventures Telangana Project : రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు వద్ద భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. రెండు రోజులు జరిగే సమ్మిట్‌లో భాగంగా తొలిరోజు సోమవారం పెట్టుబడులు వెల్లువెత్తాయి. సుమారు 35పైగా ఎంవోయులను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. తొలిరోజు మొత్తం 2.43లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే, బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్‌కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
సల్మాన్ ఖాన్‌కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో పదివేల కోట్లు (రూ.10,000కోట్లు)తో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలో ప్రత్యేక టౌన్‌షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది.
ఈ టౌన్‌షిప్‌లో ఛాంపియన్‌షిప్ గోల్ఫ్ కోర్సు, హై-ఎండ్ విశ్రాంతి సౌకర్యాలు, రేస్ కోర్సు, క్యూరేటెడ్ నేచర్ ట్రైల్స్, ప్రీమియం రెసిడెన్షియల్ స్థలాలు ఉంటాయి. ఫిల్మ్ స్టూడియోలో పెద్ద ఫార్మాట్ ప్రొడక్షన్‌లు, ఓటీటీ కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడులను స్వాగతించారు. ఈ ప్రాజెక్ట్ అనేక ఉద్యోగాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, భారతదేశంలో చలనచిత్ర నిర్మాణం, వినోదం, లగ్జరీ పర్యాటకానికి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అనుమతులు, కనెక్టివిటీ, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందించడానికి రాష్ట్రం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. సినిమా, సాంకేతికత, ప్రపంచ కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికవుతున్నందున ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో సృజనాత్మకత,. ఆర్థిక వృద్ధికి రాబోయే దశాబ్దానికి బలమైన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
