Saraswati Pushkaralu: సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం.. కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు ఇవే..

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు.

Saraswati Pushkaralu: సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం.. కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు ఇవే..

Saraswati Pushkaralu

Updated On : May 15, 2025 / 11:54 AM IST

Saraswati Pushkaralu: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం.

Also Read: Saraswati Pushkaralu: దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతీ పుష్కరాలు.. పురాణాల ప్రకారం..

కాళేశ్వరంలో ప్రత్యేకతలు ..
♦ కాళేశ్వరం.. తెలంగాణలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శ్రీకాళేశ్వర- ముక్తేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు ప్రత్యేకతలను కలిగి ఉంది.
♦ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులకు ప్రతి 12ఏళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి.
♦ దక్షిణం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం అంతర్వాహినిగా సరస్వతీ నదిని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ నదీ పుష్కరాలు జరుగుతున్నాయి.
♦ ఉత్తర భారతదేశంలో ప్రయాగ్ రాజ్ వద్ద త్రివేణి సంగమం ఏ విధంగా ఉందో ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు సంగమంగా ఏర్పడుతాయి.
♦ వార్ధా, వైన్ గంగలు ఉపనదులుగా ప్రాణహితలో కలుస్తాయి. అలా మూడు నదుల కలయికగా ఉన్న ప్రాణహిత.. కాళేశ్వరం వద్ద గోదావరి, సరస్వతీ నదుల్లో కలుస్తుంది.
♦ కాళేశ్వర ఆలయంలో ఒకే పానవట్టంపై యముడు, శివుడు (ద్విలింగాలు) కొలువయ్యారు. దేశంలో ఈ ప్రత్యేకత కలిగిన ఆలయం ఇదొక్కటే.
♦ కాళేశ్వరంలో నవగ్రహాల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నిర్వహించే నవగ్రహ పూజలకు వచ్చే భక్తులు వారి శనిపీడను నియంత్రించుకుంటారని ప్రతీతి.
♦ కాళేశ్వరాలయం గర్భగుడి నాలుగు ద్వారాలు కలిగి ఉంటుంది. ఆలయంలో నాలుగు రాజగోపురాలు, నాలుగు నంది విగ్రహాలు ఉంటాయి.
♦ కాళేశ్వరంలో ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రత్యేకం. ఇక్కడ ప్రతి మంగళవారం కాలసర్ప, రాహుకేతువుల పూజలు జరుగుతాయి.
♦ కోణార్క్, అరసవెళ్లి మాదిరిగానే కాళేశ్వరంలో సూర్యదేవాలయం ఉంది. ఈ సూర్యవిగ్రహం సప్త అశ్వాలు కలిగి ఉంటుంది.
♦ కాళేశ్వరంలో అష్టతీర్థాలు ప్రాచుర్యం పొందాయి. జ్ఞాన, వాయస (పక్షి), నృసింహ, చిత్సుక, బ్రహ్మ, హనుమ, వ్యాస, సంగమ తీర్థాలు కలిగి ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు.
♦ కాళేశ్వరంలో కొలువైన ద్విలింగాలలో ఒకటైన ముక్తీశ్వరుడు ఏకదశ రుద్ర స్వరూపంగా కొలుస్తారు.
♦ కాళేశ్వరంలో దశావతారం కలిగిన విష్ణుమూర్తి ప్రాకారంలో వెలిసి ఉన్నారు. ప్రతిభక్తుడు ఈ పూర్వ విగ్రహాన్ని దర్శించుకుంటారు.