KTR : రూ.25కోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారు- కేటీఆర్ సంచలన ఆరోపణలు

మొన్నటివరకు ఓటుకు నోటు, ఈరోజు సీటుకు నోటు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ జాతికి ద్రోహం చేశాయి. KTR

KTR : రూ.25కోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారు- కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR Slams Parites

Updated On : October 4, 2023 / 6:54 PM IST

KTR Slams Parites : తెలంగాణలో ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. అధికార, ప్రతిపక్షాల నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. దమ్ముంటే అంటూ చాలెంజ్ లు విసురుకుంటున్నారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా మరోసారి నిప్పులు చెరిగారు. డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బాన్సువాడలో ఆత్మీయ కృతజ్ఞత సభకు హాజరయ్యారు కేటీఆర్.

”కాంగ్రెస్ నియ్యత్ లేని మాటలు చెబుతుంది. కాంగ్రెస్ చేతిలో అధికారం పెడితే 3 గంటల కరెంటే. రంగస్థలం పాటను గుర్తుకు తెచ్చిన కేటీఆర్.. రైతుల ఆత్మబంధు ఈ గట్టున.. ఆ గట్టున రైతుల రాబందు ఉన్నారు. ఏ గట్టున ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు వస్తున్నాయి. కర్ణాటక బిల్డర్ల దగ్గర కాంగ్రెస్ నేతలు కమిషన్ వసూలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అదానీ నుంచి డబ్బులు తెస్తారు. కాంగ్రెస్ బీజేపీ డబ్బులు ఇస్తే తీసుకోండి. ఓటు మాత్రం కారు గుర్తుకు వేయండి.

Also Read..BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

రేవంత్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మొన్నటివరకు ఓటుకు నోటు, ఈరోజు సీటుకు నోటు. రూ.25కోట్లకు సీటు అమ్ముకుంటున్నారు. రేవంత్ చేతిలో పెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. మోసాన్ని మోసంతో జయించాలి. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. త్వరలో మేనిఫెస్టో వస్తుంది. కాంగ్రెస్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది” అని కేటీఆర్ అన్నారు.

ప్రధాని మోదీపైనా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ”రూపాయి కడితే 46 పైసలు ఇస్తున్నారు. జాకీలు పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు. ఆ పార్టీ పని ఎప్పుడో అయిపోయింది. దింపుడు గల్లం ఆశతో పసుపు బోర్డు ప్రకటన చేశారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ జాతికి ద్రోహం చేశాయి” అని ధ్వజమెత్తారు కేటీఆర్.

Also Read..Jagtial: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?