రాజన్న రాజ్యం తీసుకొస్తా…

రాజన్న రాజ్యం తీసుకొస్తా…

Updated On : February 9, 2021 / 2:01 PM IST

YSR  Sharmila’s spirited meeting : తెలంగాణలో జగనన్న బాణం దూసుకొచ్చింది. రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపించనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు ?..ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. కచ్చితంగా రాజన్న రాజ్యం తీసుకొస్తామని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణలో వైఎస్ఆర్ లేని లోటు కన్పిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఎలాంటి పరిస్థితులున్నాయో అధ్యయనం చేయాలన్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లాల నేతలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైనట్లు తెలిపారు. మిగిలిన జిల్లాల నేతలతోనూ సమావేశమవుతామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వారికి బాగా తెలుసన్నారు.

లోటస్ పాండ్ వద్ద వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ మాజీ వైసీపీ నేతలు మీటింగ్ హాజరయ్యారు. లోటస్ పాండ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. షర్మిల బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అయితే లోటస్ పాండ్ వద్ద జగన్ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఫ్లెక్సీలపై వైఎస్ఆర్, షర్మిల ఫొటోలు మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం. లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలికి ఆమె షిఫ్ట్ అయ్యారు. గచ్చిబౌలి కేంద్రంగా రాజన్న పార్టీ కార్యకలాపాలు సాగించనున్నారు. షర్మిలకు సపోర్టుగా ఇద్దరు తెలంగాణ కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.