Khammam : వేగంగా దూసుకొచ్చి పెట్రోల్ బంకులో బోల్తా.. ఖమ్మంలో లారీ బీభత్సం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో
Khammam : సిమెంట్ బూడిద లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. అనంతరం బోల్తా పడింది.

Khammam Lorrry Accident
Khammam – Lorrry Accident : అతివేగం అత్యంత ప్రమాదకరం.. రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ స్పీడ్ ప్రాణాలకే ప్రమాదం.. అని పోలీసులు పదే పదే చెబుతున్నా, రోడ్డు ప్రమాదల పట్ల అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. వేగంగా వాహనాలు నడిపి ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.
తాజాగా ఖమ్మంలో అతివేగం ఘోర ప్రమాదానికి దారితీసింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి పెట్రోల్ బంకులో బోల్తా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఖమ్మంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ బూడిద లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. అనంతరం బోల్తా పడింది. బోనకల్లు క్రాస్ రోడ్ లోని పెట్రోల్ బంకు దగ్గర ఈ ఘటన జరిగింది. లారీ మణుగూరు నుంచి కోదాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. లారీ చాలా స్పీడ్ గా దూసుకొచ్చింది. మలుపు దగ్గర లారీ వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దాంతో అదుపు తప్పిన లారీ బోల్తా పడింది. అయితే, ఆ పక్కనే పెట్రోల్ బంకు ఉంది. సరిగ్గా పెట్రోల్ బంకులో లారీ బోల్తా పడింది. అంతేకాదు.. కరెంట్ పోల్ ను లారీ బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో పెద్ద మొత్తంలో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి.
వేగంగా దూసుకొచ్చిన లారీ పెట్రోల్ బంకులో బోల్తా పడటం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రమాదం జరిగిన తీరు భయాందోళనకు గురి చేసేలా ఉంది. ఆ సమయంలో రోడ్డు పైన వాహనాలు, పెట్రోల్ బంకులో మనుషులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఎవరైనా వాహనదారులు ఉండి ఉంటే, వారు బతికే చాన్సే లేదంటున్నారు. ఇక, పెట్రోల్ బంకులో పేలుడు సంభవించి మంటలు చెలరేగి ఉంటే.. ఊహకు అందని రీతిలో దారుణం జరిగి ఉండేదని చెబుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు నిర్ధారించారు. అతివేగంగా లారీని నడిపిన డ్రైవర్.. రోడ్డుపై మలుపు దగ్గర వాహనాన్ని అదుపు చేయడంలో విఫలం అయ్యాడని, దాంతో లారీ బోల్తా కొట్టిందని వివరించారు.
Also Read..Nizamabad : కార్ల షోరూమ్‌లే టార్గెట్.. నిజామాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్