Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..
శ్రీశైలం (Srisailam Temple) పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Srisailam Temple
Srisailam Temple : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంకు భక్తుల తాకిడి పెరిగింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో శ్రీశైలం మల్లన్నను ((Srisailam Temple) దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.
హైదరాబాద్ నుంచి బస్సుల ద్వారా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు ఇప్పటి వరకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు రావాల్సి ఉండేది. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు క్రాస్‌రోడ్డు నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బస్సులను నడపనుంది. అక్కడి నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో హైదరాబాద్ నగర వాసులకు ముఖ్యంగా శ్రీశైలం రూట్‌లో ఉండే సిటీ శివారు ప్రాంత ప్రజలకు ఆర్టీసీ చార్జీలు తగ్గడంతోపాటు సమయం కూడా కలిసి రానుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే వారికి శుభవార్త.
భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న RGIA క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్ ని #TGSRTC ఏర్పాటు చేసింది.
ఎయిర్ పోర్ట్ నుంచి పుష్పక్ బస్సుల్లో సమీపంలో ఉన్న RGIA బోర్డింగ్… pic.twitter.com/OhZ0PXe1JZ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 25, 2025
‘‘ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఆర్జీఐఏ క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్‌ను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని సజ్జనార్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి పుష్పక్ బస్సుల్లో సమీపంలో ఉన్న ఆర్జీఐఏ బోర్డింగ్ పాయింట్‌కు భక్తులు చేరుకొని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలానికి వెళ్లొచ్చని సజ్జనార్ సూచించారు. ఈ బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు శ్రీశైలానికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు tgsrtcbus.in వెబ్ సైట్‌లో ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చునని సజ్జనార్ పేర్కొన్నారు. రిజర్వేషన్ సమయంలో వారు ఆర్జీఐఏ క్రాస్ రోడ్ బోర్డింగ్ పాయింట్‌ను ఎంచుకోవాలని సూచించారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని’’ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
భారీగా పెరిగిన హుండీ ఆదాయం..
శ్రీశైలం ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో హుండీ ఆదాయంసైతం గణనీయంగా పెరిగింది. శ్రీశైలం ఆలయంలో గత బుధవారం (ఆగస్టు 20) అధికారులు హుండీ లెక్కించారు. గత 27రోజులకుగాను భక్తులు భారీగా నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని స్వామివారికి కానుకలుగా సమర్పించారు. ఈ క్రమంలో మొత్తం కానుకలు రూపంలో రూ.4.51కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. వీటితోపాటు 164.500 గ్రాముల బంగారం.. 5.840 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులను కూడా భక్తులు కానుకలుగా సమర్పించినట్లు తెలిపారు.
నల్లమల అడవుల మధ్యలో శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.. 18 శక్తిపీఠాల్లో ఒకటిగా ఉన్న శ్రీశైలంలో పరమశివుడు మల్లికార్జున స్వామి రూపంలో, పార్వతీదేవి భ్రమరాంబిక రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. నల్లమల్ల అరణ్యంలో, కృష్ణానది ఒడ్డున అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉండటంతో ఆ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది.