Bayya Sunny Yadav : పరారీలో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్.. త్వరలో అరెస్ట్ చేస్తామన్న సూర్యాపేట డీఎస్పీ
బెట్టింగ్ యాప్ ల వల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉందన్నారు ఎస్పీ రవి.

Bayya Sunny Yadav : సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో యూట్యూబర్, ఇంటర్నేషనల్ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సూర్యాపేట డీఎస్పీ రవి తెలిపారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నాడని సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉందన్నారాయన.
బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లక్షల రూపాయల డబ్బులు పొగొట్టుకుంటున్నారు. అప్పుల పాలవుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేయాలని సజ్జనార్ కోరగా.. అతడిపై సూర్యాపేట పోలీసులు కేసు ఫైల్ చేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చట్ట విరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా.. బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని డబ్బులు గెలుచుకోవచ్చని సన్నీ యాదవ్ చెప్పాడు. దాంతో అతడిపై సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్లిన సన్నీ యాదవ్.. బైక్ రైడింగ్ కు సంబంధించిన కెమెరాలు కొన్నాడు. ఈ క్రమంలో ఆ కెమెరాలను కొనడానికి బెట్టింగ్ యాప్ లో గెలిచిన డబ్బును ఉపయోగించినట్లు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన సజ్జనార్.. సన్నీ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Also Read : స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు.. టైమింగ్స్ ఇవే..
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సన్నీ యాదవ్ పై నూతన్ కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని, అతనిపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ రవి తెలిపారు.
”బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశాం. సూర్యాపేట జిల్లా నూతన్ కల్ మండలానికి చెందిన సన్నీ యాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. అతడి వల్ల యువత తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అందుకే అతడిపై నూతన్ కల్ పీఎస్ లో కేసు నమోదు చేశాం. ప్రస్తుతం పరారీలో ఉన్న సన్నీని త్వరలోనే పట్టుకుంటాం” అని డీఎస్పీ వెల్లడించారు.
కాగా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవలే విశాఖకు చెందిన లోకల్ బాయ్ నానిని కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన వల్ల తప్పు జరిగిందని లోకల్ బాయ్ నాని సారీ కూడా చెప్పాడు. ”చేసిన తప్పుని ఒప్పుకుంటున్నా.. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటా. నేను చదువుకోలేదు. అందుకే ఇలా పొరపాటు చేశాను. సజ్జనార్ సార్ కి సారీ చెబుతున్నా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారందరికీ ఇలాగే బుద్ధి వచ్చేలా చేయాలని కోరుకుంటున్నా” అంటూ లోకల్ బాయ్ నాని ఒక వీడియోను విడుదల చేసిన విషయం విదితమే.