కేసీఆర్ వైఖరితో పోచారం కన్నీళ్లు పెట్టుకున్నారు: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

కేసీఆర్ ఫాంహౌస్‌కి పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్తే అపాయింట్‌మెంట్‌ లేదని తిప్పి పంపించారు. కేసీఆర్ వైఖరితో పోచారం, ఇతర ఎమ్మెల్యేలు కండ్లలో నీళ్లు పెట్టుకున్నారని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ వైఖరితో పోచారం కన్నీళ్లు పెట్టుకున్నారు: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

Tammannagari Ram Mohan Reddy

Tammannagari Ram Mohan Reddy: కాంగ్రెస్ పార్టీతోనే భవిష్యత్తు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారని పరిగి ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి విచిత్రంగా ఉందని, బాద్షా సినిమాలో బ్రహ్మానందం లాగా ఆలోచిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ”కేసీఆర్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మంచిది, రేవంత్ చేర్చుకుంటే చెడ్డదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఏవిధంగా ప్రవర్తించారో వాళ్లు మర్చిపోవడం లేదు. కేసీఆర్ ఫాంహౌస్‌కి పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్తే అపాయింట్‌మెంట్‌ లేదని తిప్పి పంపించారు. కేసీఆర్ వైఖరితో పోచారం, ఇతర ఎమ్మెల్యేలు కండ్లలో నీళ్లు పెట్టుకున్నార”ని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని కేసీఆర్ తమ నాయకులకు చెప్పారని ఆరోపించారు. ఇకనైన కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకుని ప్రజా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మంచిదని హితవు పలికారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్థన మేరకే విద్యుత్ రంగంపై కమిషన్ వేశామని గుర్తు చేశారు. కమిషన్ వేయమన్న జగదీష్ రెడ్డి ఇప్పుడు కమిషన్ వద్దు అంటున్నారని చెప్పారు.

కేటీఆర్ మాటలు హాస్యాస్పదం: ఎమ్మెల్యే రాగమయి
సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ తమదేనని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు చూసి జనాలు నవ్వుతున్నారని ధ్వజమెత్తారు. 10 సంవత్సరాలు కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకొని ఇప్పుడు అన్ని క్రెడిట్లు తనవే అంటున్నారని మండిపడ్డారు.

Also Read : తెలంగాణ కాంగ్రెస్‌లో నయా పవర్‌ సెంటర్‌? సీఎం రేవంత్ కన్నా ఆ మహిళా నేతకు పలుకుబడి ఎక్కువా?

”సీతారామ ప్రాజెక్టు మంత్రి తుమ్మల మానస పుత్రిక. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకి రావాలనేది తుమ్మల ఆకాంక్ష. మంత్రి తుమ్మల అపరభగీరథుడు. సీతారామ ప్రాజెక్టు విషయంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏం చేసింది? సీతారామ పాజెక్టు ద్వారా పది సంవత్సరాల్లో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేద”ని ఎమ్మెల్యే రాగమయి అన్నారు.