మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన కూటమి సర్కార్.. గ్రౌండ్ లెవల్‌లో వైసీపీ బాగోతాలపై ఫోకస్..
ఇప్పటివరకు రాష్ట్రస్థాయి అవినీతిపై మాత్రమే దృష్టి పెట్టిన కూటమి సర్కార్.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బాగోతాలను బయటపెట్టేందుకు రెడీ అవుతోంది.

Chandrababu-Jagan
వైసీపీ అవినీతి బాగోతాలు బయటపెడతాం అని పదేపదే చెప్తున్న కూటమి సర్కార్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. గత సర్కార్‌లో కీలకంగా ఉన్న నాయకులు బాగోతాలు బయటపెడుతున్న కూటమి సర్కార్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కూటమి సర్కార్ నిర్ణయంతో.. ప్రజాక్షేత్రంలో వైసీపీ మరింత టార్గెట్ కావడం ఖాయమా.. ఈసారి ఉచ్చు బిగుసుకునేది ఎవరికి.. ఇంతకీ కూటమి సర్కార్ సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి..
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి నాలుగు నెలలు అవుతోంది. వంద రోజుల పాలనలో మంచి చేశామని.. మనది మంచి ప్రభుత్వం అని ప్రచారం కూడా మొదలుపెట్టింది. వైసీపీ అవినీతి బాగోతాలు, అన్యాయాలను బయటపెడతాం అని పదేపదే చెప్తున్న కూటమి సర్కార్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. మైనింగ్, మద్యం, ఇసుక సహా అనేక స్కాంలపై ఇప్పటికే విచారణలు జరుగుతున్నాయ్. గనుల శాఖలో రెండున్నర వేల అవినీతి జరిగిందని.. కొన్ని అరెస్ట్‌లు కూడా చేశారు.
ఇక మద్యం స్కామ్‌లోనూ కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ బయటకు రాలేదు. ఇక హీరోయిన్ జెత్వానీ కేసులో లోతైన విచారణ జరుపుతున్నారు. ఇలా వరుస వివాదాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయ్. దీంతో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. కనిపించడం కాదు కదా.. మాట కూడా వినిపించడం లేదు. ఇలాంటి సమయంలో వైసీపీ అవినీతిని గ్రౌండ్ లెవల్‌కు తీసుకెళ్లడమే ప్లాన్ అన్నట్లుగా కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఎంత దోపిడీ జరిగింది?
జగన్ హయాంలో.. జగనన్న కాలనీలు పేరుతో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూములను సేకరించారు. ఈ పథకం ముసుగులో వైసీపీ సర్కార్ దాదాపు 15వందల కోట్లపైనే దోపిడీ చేసిందని.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అంచనా వేస్తోంది. ఈ అక్రమాలకు పాల్పడింది ఎవరు.. కుంభకోణంలో లబ్ధి చేకూరింది ఎవరికని లెక్కలు తేలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లే అవుట్లకు సంబంధించి… ఏయే ప్రాంతాల్లో భూములు కొన్నారు… వాస్తవ మార్కెట్ విలువ ఎంత… ఎంత ధరకు కొనుగోలు చేశారు… ఆ నిధులను ఎవరి ఖాతాలకు జమ చేశారు.. అక్కడి నుంచి అది ఎవరికి చేరిందనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది.
లేఅవుట్ల వారీగా వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే కొంతమంది వివరాలతో జాబితా సిద్ధం చేసింది. వారిపై క్రిమినల్ కేసుల నమోదు, సొమ్ము రికవరీకి సిఫార్సు చేయనుంది. అప్పట్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వైసీపీ రాష్ట్ర, నియోజకవర్గ నేతలు మొదలు గ్రామస్థాయి నాయకుల వరకూ అనేక మంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారి పరిధిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించింది.
25 వేలకు పైగా ఎకరాల భూమి కొనుగోలుకు 11వేల 500 కోట్లకు పైగా అప్పట్లో సర్కార్ ఖర్చు చేయగా.. అందులో ఎక్కువ శాతం సొమ్ము వైసీపీ నేతలు వివిధ మార్గాల్లో దోచుకున్నట్లు తేల్చింది. భూసేకరణను అడ్డం పెట్టుకుని ఒక్కోచోట ఒక్కో తరహాలో దోచుకున్నట్లు విజిలెన్స్ విచారణ తేల్చింది. కొన్నిచోట్ల వాస్తవ మార్కెట్ విలువ కంటే అనేక రెట్లు అధిక ధరలకు ప్రభుత్వంతో భూములు కొనిపించి.. ఆ వ్యత్యాసం మొత్తాల్ని కాజేసినట్లు తేలింది. ఇక మరికొన్నిచోట్ల ఏ మాత్రం నివాసయోగ్యం కాని భూముల్నీ ప్రభుత్వంతో అత్యధిక ధరలకు కొనుగోలు చేయించారని తెలుస్తోంది.
ఏయే మోసాలు జరిగాయని అంచనా?
ఇలాంటి లేఅవుట్ల వివరాలన్నింటినీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రత్యేకంగా సేకరించినట్లు టాక్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడిలోని ఒక్క లేఅవుట్‌లోనే ఏకంగా 150కోట్లు పక్కదారి పట్టిందని విజిలెన్స్ గుర్తించినట్లు టాక్. ముంపు భూములకు డబుల్ రేట్లు ఇచ్చిన కొన్నారని తెలుస్తోంది. కొన్నిచోట్ల కొండలు, గుట్టల్ని కొనిపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని విజిలెన్స్ గుర్తించింది.
ఇప్పటివరకు రాష్ట్రస్థాయి అవినీతిపై మాత్రమే దృష్టి పెట్టిన కూటమి సర్కార్.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బాగోతాలను బయటపెట్టేందుకు రెడీ అవుతోంది. జనాల్లోనే వైసీపీని నిలదీసి.. టార్గెట్ చేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఒక్క భూముల వ్యవహారం మాత్రమే కాదు.. చాలా విషయాలపై నజర్ పెట్టాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయింది. వైసీపీ మీద కక్షసాధింపు ధోరణి అనే మార్క్ రాకుండా.. అసలు సంగతి ఇదీ అని జనాల్లోనే తేల్చాలన్నది కూటమి సర్కార్ ప్లాన్‌గా కనిపిస్తోంది. దీంతో ఏపీలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. అసలే జంపింగ్‌లతో అల్లాడుతున్న వైసీపీ.. ఇప్పుడు కూటమి సర్కార్ దూకుడుతో మరింత ఇబ్బందులు పడడం ఖాయంగా కనిపిస్తోంది.
Zaheerabad Politics: జహీరాబాద్‌లో కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ లీడర్ కావాలా?