మీ ఇంటి దగ్గర్లోనే టెన్త్ పరీక్షలు రాసే ఛాన్స్

  • Published By: murthy ,Published On : June 6, 2020 / 02:10 AM IST
మీ ఇంటి దగ్గర్లోనే టెన్త్ పరీక్షలు రాసే ఛాన్స్

Updated On : June 6, 2020 / 2:10 AM IST

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేలా ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హాస్టళ్లలో ఉండి చదువుకున్న విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.  కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులకు కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. 

అయితే సమయం తక్కువగా ఉన్నందు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల హాల్‌టికెట్ల వివరాలు, తాము నివాసముంటున్న ప్రాంతాలు, పరీక్ష రాయాలనుకునే సెంటర్లు, జిల్లా, మండలాల వివరాలను సంబంధిత డీఈవోలకు ఈ నెల 7వ తేదీ ఆదివారం వరకు తెలియజేయాలని స్పష్టం చేశారు. దాంతో విద్యార్థుల కోసం ఆయా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయగలుగుతామని చెప్పారు.

విద్యార్థుల వివరాలను జిల్లాల డీఈవో కార్యాలయాల్లో నేరుగా కానీ, ఫోన్‌ నంబర్ల ద్వారా కానీ, లేదంటే జిల్లాల్లో ప్రత్యేకంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాల ద్వారా ఇవ్వొచ్చని తెలిపారు. కరోనా కారణంగా పట్టణాల్లోని హాస్టళ్లు కొన్ని తెరవలేదని, తెరిచినా ఆయా పాఠశాలలకు వచ్చి హాస్టళ్లలో ఉండి పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులు తాము ఉంటున్న నివాస ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వెల్లడించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల పాఠశాలల నుంచి 5.34 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు వివిధ పట్టణ ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉండి చదువుకుంటుండటంతో ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పుడు పరీక్షలు రాయలేని విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనా వారిని రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణించే అంశాన్ని పరీక్షల విభాగం పరిశీలిస్తోంది. దీనిపై శనివారం స్పష్టత రానుంది. 

Read: రాత్రి గం.8-30 ల దాకా వైన్ షాపులకు అనుమతి