Telangana Assembly Elections 2023: ఇక దూకుడే.. ఎన్నికల రణరంగంలోకి కేసీఆర్.. ఎప్పుడు ఏ నియోజకవర్గంలో పర్యటిస్తారంటే?

నియోజకవర్గాల పర్యటనతో పాటు సీఎం కేసీఆర్ పలు జిల్లాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. ఈ క్రమంలో ఈనెల 26 లేదా 27 తేదీల్లో వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది.

Telangana Assembly Elections 2023: ఇక దూకుడే.. ఎన్నికల రణరంగంలోకి కేసీఆర్.. ఎప్పుడు ఏ నియోజకవర్గంలో పర్యటిస్తారంటే?

CM KCR

Updated On : October 10, 2023 / 12:46 PM IST

CM KCR : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులనుసైతం ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 15నుంచి మొదలుపెట్టి ఎన్నికల ప్రచార పర్వం పూర్తయ్యే వరకు కేసీఆర్ ప్రజల్లో ఉండనున్నారు. నియోజకవర్గాల వారిగా వరుసగా సభలతో పాటు, పలు జిల్లాల్లో భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గోనున్నారు.

Read Also : YS Sharmila : పాలేరు నుంచి షర్మిల పోటీ..! ఒంటరిగానే ఎన్నికల బరిలోకి..!

ఈనెల 15న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ సమావేశంలోనే అభ్యర్థులకు పార్టీ బీఫారాలు అందజేస్తారు. ఆ తరువాత పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఈసారి మేనిఫెస్టోలో కీలక అంశాలను పొందుపర్చనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకొనే ఈ మేనిఫెస్టో ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజు 16వ తేదీ నుంచి నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన మొదలవుతుంది. తొలి విడతలో కేసీఆర్ పర్యటించే నియోజకవర్గాలు, తేదీల వివరాలను బీఆర్ఎస్ అదిష్టానం వెల్లడించింది. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 17న సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో, 18న జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో సీఎం కేసీఆర్ పాల్గోనున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన, సభలకు సంబంధించి షెడ్యూల్ ను బీఆర్ఎస్ అధిష్టానం త్వరలో విడుదల చేయనుంది.

Read Also : Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల కోడ్.. తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ డబ్బు, కిలోల కొద్దీ బంగారం

నియోజకవర్గాల పర్యటనతో పాటు సీఎం కేసీఆర్ పలు జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. ఈ క్రమంలో ఈనెల 26 లేదా 27 తేదీల్లో వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది. వరంగల్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లోనూ కేసీఆర్ భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఎన్నికలకు సంబంధించి ప్రచారం పూర్తయ్యే వరకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉండేలా పార్టీ అధిష్టానం పూర్తిస్థాయి షెడ్యూల్ ను సిద్ధం చేయడంలో నిమగ్నమైంది.

ఈ దఫా ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ కేసీఆర్ పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాల్లో నవంబర్ 9న నామినేషన్లు దాఖలు చేస్తారు. కేసీఆర్ సెంటిమెంట్ మేరకు నామినేషన్ రోజు ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత గజ్వేల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. మధ్యాహ్నం కామారెడ్డి లో నామినేషన్ ను కేసీఆర్ సమర్పిస్తారు. అనంతరం కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.