EC scanner: సోషల్‌ మీడియాపై ఈసీ నిఘా.. తప్పుడు పోస్టింగ్‌లపై చర్యలు

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం సహా ఇతర సోషల్‌ మీడియా యాప్‌ల్లో రాజకీయ పార్టీలు, నాయకులకు అనుకూలంగా.. వ్యతిరేకంగా చేసే పోస్టులపై ప్రత్యేక బృందంతో నిఘా వేసింది ఎన్నికల సంఘం.

EC scanner: సోషల్‌ మీడియాపై ఈసీ నిఘా.. తప్పుడు పోస్టింగ్‌లపై చర్యలు

social media posts under Election Commission scanner

Updated On : October 14, 2023 / 5:51 PM IST

Election Commission scanner: సోషల్‌ మీడియా వారియర్స్‌కు హెచ్చరిక.. చేతిలో ఫోన్‌ ఉందికదా అని ఇష్టం వచ్చిన పోస్టులు పెడతామంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. మమ్మల్ని ఎవరూ గుర్తించరూ.. పట్టించుకోరని ఇష్టానుసారం ప్రవర్తిస్తే మీపై కేసులు నమోదవడం ఖాయం.. నాయకుల వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం వాటిల్లేలా కాని.. రెండు మతాలు, కులాలు, వర్గాల మధ్య అల్లర్లు చెలరేగే అవకాశం కల్పించే ఏ విధమైన పోస్టు పెట్టినా.. మీపై యాక్షన్‌ ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు.

అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా వేస్తోంది ఎన్నికల సంఘం.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం సహా ఇతర సోషల్‌ మీడియా యాప్‌ల్లో రాజకీయ పార్టీలు, నాయకులకు అనుకూలంగా.. వ్యతిరేకంగా చేసే పోస్టులపై ప్రత్యేక బృందంతో నిఘా వేసింది ఎన్నికల సంఘం. ప్రతి జిల్లాలోనూ మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నగరానికి సంబంధించి బల్దియా ప్రధాన కార్యాలయంలో మీడియా మానటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడం ఖాయమంటూ హెచ్చరిస్తోంది ఈసీ.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో మద్యం, డబ్బు తరలింపుపై ఫోకస్ పెట్టిన ఎన్నిక కమిషన్.., ప్రత్యేకంగా ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్లపైనా నిఘా పెట్టింది. అన్ని న్యూస్‌ చానళ్లు, యూట్యూబ్ చానళ్లతోపాటు బల్క్ మెసేజ్‌లపైనా దృష్టి పెట్టారు. అన్ని పార్టీల సోషల్ మీడియా ప్లాట్ ఫాం, నాయకుల సోషల్ మీడియా పేజీలు, కామెంట్లను పర్యవేక్షిస్తున్నారు.

Also Read: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి.. డబ్బు రవాణాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎన్నికల కోడ్ ఉల్లంఘించేవిధంగా కాని నిబంధనలకు విరుద్ధంగా కాని ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఇతర వర్గాలను కించపర్చేలా చేసే పోస్టింగ్లపై నిఘా వేసింది ఈసీ. తప్పుడు సమాచారం ప్రచారం చేసినా.. అల్లర్లు ఉద్రిక్తతలు చెలరేగేలా వ్యవహరించినా సుమోటాగా యాక్షన్‌ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.