BJP Vs Congress: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ మంత్రులు.. మాటల తూటాలు

గత ప్రభుత్వం తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

BJP Vs Congress: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ మంత్రులు.. మాటల తూటాలు

Sridhar Babu in Assembly

Updated On : December 20, 2023 / 4:50 PM IST

Maheshwar Reddy: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య మాటల తూటాలు పేలాయి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పాటు గత బీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ప్రతి సంవత్సరం అప్పులు పెంచుకుంటూ పోయారని అన్నారు. మొత్తం కలిపి రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి చాలా సాయం చేసిందని అన్నారు. సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఎరువుల సబ్సిడీకి ఆర్థిక సాయం చేసిందని చెప్పారు. అన్ని నిధులు ఇచ్చినప్పటికీ కేంద్ర సర్కారుపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు.

అబద్ధాలు చెబుతూ ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సభను మిస్ లీడ్ చేయాలనుకోవడం దురదృష్టకరమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఇక్కడ అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మిత్రుడు ఏపీ సీఎం జగన్ మోటార్లకు మీటర్లు పెట్టారంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నెరవేర్చలేని హామీలను ఇచ్చిందని చెప్పారు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఎలా అమలు చేస్తారో, వాటిని నిధులు ఎలా ఇస్తారో చెప్పాలని నిలదీశారు. అధికారంలోకి రావడానికి మాత్రమే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మూడు డీఏలతో పాటు కొత్త పీఆర్సీ ఇవ్వాలని, ఎలా ఇస్తారో చెప్పాలని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. అప్పులు కట్టేందుకు మళ్లీ అప్పులు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కొత్తగా అప్పు తెచ్చుకునే పరిస్థితి లేదంటూ, రాష్ట్ర ప్రజలపై భారం మోపుతామంటే మాత్రం తాము ఒప్పుకోబోమని అన్నారు.

మోదీ హామీలు ఇవ్వలేదా?: శ్రీధర్ బాబు

మహేశ్వర్ రెడ్డి విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ప్రధాని మోదీ దేశంలోని పౌరుల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని వేశారా? అని అడిగారు. ఆరు గ్యారెంటీల అమలు గురించి బీజేపీ-బీఆర్ఎస్ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామన్నారు. పార్లమెంట్లో బీజేపీ తెలంగాణను అవమానించిందని అన్నారు.

komatireddy Rajgopal Reddy : నువ్వెంత కష్టపడ్డా.. కేసీఆర్ తరువాత కేటీఆరే నువ్వు కాదని తెలుసుకో : హరీశ్ రావుపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు