Telangana BJP : లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచార పర్వంలోకి బీజేపీ.. విజయ సంకల్ప యాత్రలు షురూ

తెలంగాణలో లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. విజయ సంకల్ప యాత్రలతో ప్రచారపర్వాన్ని షురూ చేసింది.

Telangana BJP : లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచార పర్వంలోకి బీజేపీ.. విజయ సంకల్ప యాత్రలు షురూ

Telangana BJP

Updated On : February 20, 2024 / 9:54 AM IST

BJP Vijayasankalpa Yatra : తెలంగాణలో లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. విజయ సంకల్ప యాత్రలతో ప్రచారపర్వాన్ని షురూ చేసింది. మరో రెండు నెలల్లో లోక్‌స‌భ‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎక్కువ సమయం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఆ పార్టీ నేతలు దృష్టిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయసంకల్ప యాత్రలను జాతీయ నేతలు ప్రారంభించారు.

Also Read : మీసం మెలేసి.. సై అంటే సై.. జగన్, చంద్రబాబు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం

మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. ఐదు కస్లస్టర్లలో ఏకకాలంలో బస్సు యాత్రలకు ఆ పార్టీ అధిష్టానం ప్లాన్ చేసింది. ఇందులోభాగంగా ఇవాళ నాలుగు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. బాసరలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తో కలిసి బస్సు యాత్రలో అస్సోం సీఎం హిమంత పాల్గొంటారు. ఈటెల రాజేందర్ తో కలిసి యాదగిరి గుట్ట నుంచి గోవా సీఎం ప్రమోద్ సావంత్ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. నారాయణ పేట జిల్లా మక్తల్ లో కిషన్ రెడ్డి తో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొని బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తాండూరులో బండి సంజయ్ తో కలిసి కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ప్రారంభిస్తారు. యాత్ర ప్రారంభానికి సంబంధించి నారాయణ పేటకు వెళ్లేముందు కిషన్ రెడ్డి కాచిగూడలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Raed : వాళ్ల చెంపలు పగలకొట్టండి.. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

17 పార్లమెంట్, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,500 కిలో మీటర్ల మేర ఈ విజయసంకల్ప యాత్రలు కొనసాగుతాయి. మొత్తం యాత్రల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 72 ఈవెంట్స్ ఉండగా.. మార్చి 2 నాటికి విజయ సంకల్ప యాత్ర పూర్తి కానుంది. అదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ లలో 12 రోజుల పాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు వెయ్యి కిలో మీటర్లు ఈ యాత్ర సాగనుంది. అదేవిధంగా కరీంనగర్, చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1200 కిలో మీటర్లు దూరం ఈ యాత్ర సాగుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ లలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1400 కిలో మీటర్లు బీజేపీ నేతలు బస్సు యాత్ర చేయనున్నారు.

సమ్మక్క సారక్క జాతర కారణంగా కాకతీయ భద్రకాళి విజయసంకల్ప యాత్ర రెండు రోజుల ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభం కానుండగా.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ లలో ఏడు రోజులపాటు 21 నియోజకవర్గాల్లో వెయ్యి కిలో మీటర్లు యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగంగా బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలుసుకుంటారు. కేంద్ర విజయాలు, కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను బీజేపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు.