Telangana Assembly Budget Session 2024: బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

బడ్జెట్ ప్రతిపాద‌న‌కు ఒక రోజు కేటాయించి.. రెండు నుంచి మూడు రోజులు పాటు బడ్జెట్ పై చర్చ..

Telangana Assembly Budget Session 2024: బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Telangana Budget Sessions 2024

Updated On : February 8, 2024 / 11:54 AM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవి తొలి బడ్జెట్ సమావేశాలు.. ప్రతిపక్ష హోదాలో మాజీ సీఎం కేసీఆర్.. ఇక తెలంగాణలో అసలు సిసలు రాజకీయ చదరంగం మొదలుకానుంది.

నీటి ప్రాజెక్ట్‌లను నీటి మూటలుగా మార్చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు తీసుకురానుంది. మరి ఈ చర్చలో కేసీఆర్‌ ఎలా రియాక్ట్ అవుతారు? గవర్నర్ స్పీచ్ ఎలా ఉండబోతోంది. కొత్త సర్కార్ ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించనుంది.? ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటల 30 నిమిషాలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ స్పీచ్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ స్పీచ్‌పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుందని అందరిలో ఆసక్తి నెలకొంది.

ఓటాన్ అకౌంట్
ఈ నెల 10న శాసనసభలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మరుసటి రోజు సభకి సెలవు ఉంటుంది. తిరిగి 12న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చించనున్నారు. సమావేశాలు ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశముంది.

గవర్నర్ స్పీచ్ ఒక రోజు, గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాద తీర్మానంపై చ‌ర్చకు మరో రోజు స‌భా స‌మ‌యాన్ని కేటాయించే చాన్స్ ఉంది. ఇక‌ బడ్జెట్ ప్రతిపాద‌న‌కు ఒక రోజు కేటాయించి.. రెండు నుంచి మూడు రోజులు పాటు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది. నిజానికి ఈ బ‌డ్జెట్ స‌మావేశాలు సుధీర్ఘంగా జ‌ర‌గాల్సి ఉంది. కానీ ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ కావ‌డం, త్వర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యుల్ రానుండడంతో అసెంబ్లీ సమావేశాలు వారం రోజులకు మించి జరగవనే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేశారన్న దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోంది. మరో రెండు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే వారికి ఉచిత కరెంట్ పథకాన్ని అమలు చేయనున్నారు.

ఈసారి సభా సమావేశాలు రాజకీయ వేదికగా మారే అవకాశముంది. ఇప్పటికే సభలో ఇరిగేషన్ శాఖపై వైట్ పేపర్ విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా లోప భూయిష్టంగా మారిందంటూ.. అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు బీఆర్ఎస్ నేతలు కూడా సై అంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీకి వస్తానని చెప్పడంతో ఈ సమావేశాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. మరి ఈ సమావేశాల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతో తెలుసా?