CM K Chandrashekar Rao : ఈడీనా బోడీనా.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. ప్రజాదీవెన సభలో ప్రధాని మోదీపై కేసీఆర్ నిప్పులు
ఈడీ కేసులు పెడతామంటూ ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాళ్లను బెదిరిస్తున్నారు. నీ మీద ఈడీ కేసు పెడతామంటే... ఈడీనా, బోడీనా అని నేను అన్నా. ఈడీ వస్తే నా దగ్గర ఏముంది? ఏం పీక్కుంటావో పీక్కో..

CM K Chandrashekar Rao : మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించింది. మునుగోడు ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. మునుగోడులో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. తాజాగా ప్రజాదీవెన పేరుతో మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఆయన నేరుగా నిప్పులు చెరిగారు.
మీటర్లు పెట్టమనే బీజేపీ కావాలో, మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కావాలో మునుగోడు ఓటర్లు తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే రేపు మోటార్లకు మీటర్లు పెడతారని కేసీఆర్ హెచ్చరించారు. ”వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని బీజేపీతో నేను పోరాడుతున్నా. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు కూడా రాలేదు. ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే, బాయి మోటార్లకు మీటర్లు పడతాయి. ప్రజల బలం చూసుకునే నేను మీటర్లు పెట్టనని కేంద్రంతో పోరాడుతున్నా.
రైతుబంధు, పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారని మమ్మల్ని నిలదీశారు. రైతుబంధు, రైతుభీమా బంద్ పెట్టాలని అంటున్నారు. రైతులకు అనవసరంగా డబ్బులు పంచి పెడుతున్నామని బీజేపీ నేతలు నిలదీశారు. మోదీ గర్వమే ఆయనకు శత్రువు అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తున్నారు” అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు కేసీఆర్.
మునుగోడులో టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు కేసీఆర్. కొత్త వ్యవసాయ మీటర్లు పెట్టాలని తెలంగాణపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని.. అయినా, రైతుల మేలు కోసం కేంద్రం ఒత్తిడికి తాము తలొగ్గడం లేదని అన్నారు. ఈ దేశం ఎవని అయ్య సొత్తు కాదని కేసీఆర్ చెప్పారు.
”ఈడీ కేసులు పెడతామంటూ ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాళ్లను బెదిరిస్తున్నారు. నీ మీద ఈడీ కేసు పెడతామంటే… ఈడీనా, బోడీనా అని నేను అన్నా. ఈడీ వస్తే నా దగ్గర ఏముంది? ఏం పీక్కుంటావో పీక్కో.. ప్రజల కోసం ఆలోచించే వాళ్లు, ప్రజలకు కడుపునిండా బుక్కెడు అన్నం దొరకాలనుకునే వాళ్లు నీకు భయపడరు మోదీ” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.