CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ
ప్రత్యేక విమానంలో హస్తినకు పయనం కానున్నారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో రేవంత్, భట్టి విక్రమార్క భేటీ కానున్నారు.

CM Revanth Reddy Delhi Tour
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(డిసెంబర్ 26) సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. విభజన సమస్యలు, తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. రేపు భట్టి విక్రమార్క ఖమ్మం జల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని వాయిదా వేసుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హస్తినకు పయనం కానున్నారు రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో రేవంత్, భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. కాగా, సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన హామీలపై ప్రధానితో చర్చించనున్నారు.
Also Read : 6 గ్యారెంటీలకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పథకాల అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు
రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చింబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కానుండటం ఇదే తొలిసారి. ఇది మర్యాదపూర్వక భేటీగానూ తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు పూర్తై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిగా ఎవరు ఉంటే వారిని కలవడం ఆనవాయితీగా వస్తోంది.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తనవంతు సహకారం అందిస్తుందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ లో తెలిపిన విషయం విదితమే. తెలంగాణ ప్రజల తీర్పును స్వాగతిస్తాం అంటూనే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుందని ప్రధాని మోదీ తెలపడం జరిగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారి ప్రధాని మోదీని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి ఏమేం అడుగుతారు? అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
Also Read : లంచం ఎందుకు తీసుకోవాలో వివరించి చెప్పిన తహసీల్దారు.. మీరూ వింటారా?
తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. అలాగే విభజన ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇటు ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ బకాయిలు సుమారు 700 కోట్ల పైచిలుకు పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన అంశంపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.