Dasari Manohar Reddy: పెద్దపల్లి నియోజకవర్గంలో ఆ రికార్డును సాధిస్తారా?
పెద్దపల్లి నియోజవకర్గంలో వరుసగా మూడోసారి ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. అయితే.. ఆ రికార్డును ఎలాగైనా సాధించాలని చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి.
Peddapalli MLA Dasari Manohar Reddy: ముచ్చటగా మూడోసారి గెలిచి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలన్నది ఆ ఎమ్మెల్యే ఆశ. కానీ.. లోకల్ క్యాడర్ చేస్తున్న పొరపాట్లు కాస్తా.. ఆయనకు ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా పథకాల సంగతేంటంటూ జనాలు ప్రశ్నిస్తుండటం ఆ ప్రజాప్రతినిధికి తలనొప్పిగా మారింది. ఇంతకీ ఆ సంకట పరిస్థితి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఎవరు? అక్కడ క్యాడర్ చేస్తున్న తప్పులేంటి?
పెద్దపల్లి నియోజవకర్గంలో వరుసగా మూడోసారి ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. అయితే.. ఆ రికార్డును ఎలాగైనా సాధించాలని చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి. అలా గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో అలుపెరగకుండా ప్రచారం సైతం చేస్తున్నారాయన. కానీ.. నియోజకవర్గంలోని కొందరు సెకండ్ క్యాడర్ లీడర్లు చేస్తున్న పనులు ఆయనకు మైనస్‌గా మారుతున్నాయి.
తన నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తూ.. అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి. అయితే.. అర్హులైన వారికి పథకాలు అందడం లేదని ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయడంతో అయోమయంలో పడటం ఆయన వంతుగా మారింది. ఇటీవల ఓదెల మండల కేంద్రంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వెళ్లిన మనోహర్‌రెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. డబ్బులిస్తేనే.. దళిత బంధు లిస్టులో పేరు నమోదు చేస్తామని పార్టీ నాయకులు అంటున్నారంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కనగర్తి గ్రామంలోనూ అర్హులైన వారికి ఇళ్లు ఎందుకివ్వరంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు నేతలు.
Also Read: కాంగ్రెస్ లో నాకే గ్యారంటీ లేదు.. ఇక పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు దేవుడెరుగు : నాగం జనార్ధన్ రెడ్డి
ఇలా సంక్షేమ పథకాలకు డబ్బులివ్వాలంటూ లోకల్ లీడర్లు చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. మండల నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకే అందేలా చూడాలని.. ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మనోహర్‌రెడ్డి.
Also Read: తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో అంటే.. టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో కాసాని జ్ఞానేశ్వర్
ఓవైపు హ్యాట్రిక్ కొట్టాలన్న తపనతో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేకు.. లోకల్ క్యాడర్ చేస్తున్న పనులు ఇబ్బందిగా మారాయి. మొదటి నుంచీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నది మరికొందరు బీఆర్‌ఎస్ నాయకుల వాదన. మొత్తంగా ఇందుకోసం ఎమ్మెల్యే చేపడుతున్న నష్ట నివారణ చర్యలు పనిచేస్తాయో, లేదో వేచి చూడాల్సిందే.