Liquor Shops : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పెంపు.. ఎందుకంటే?
Liquor Shops : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల దాఖలు గడువును పెంచింది.

Telangana government
Liquor Shops : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల దాఖలు గడువును పెంచింది. ఈనెల 23వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు.
వాస్తవానికి శనివారంతో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియాల్సి ఉంది. బీసీ బంద్, బ్యాంకుల బంద్‌ల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామని ఫిర్యాదులు రావడంతో.. ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కొత్తగా విడుదలైన ఆదేశాల ప్రకారం.. ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్రంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 27వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. డ్రా విజేతలకు మద్యం దుకాణాలు కేటాయిస్తారు.
రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి (2025-27) సంబంధించి ఎక్సైజ్ శాఖ గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు.
గత మద్యం విధానంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షలుగా రుసుం చెల్లించాల్సి ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ రుసుమును రూ.3లక్షలకు పెంచారు. అయితే, శనివారం సాయంత్రం నాటికి 2,620 మద్యం దుకాణాలకు 85,363 దరఖాస్తులు వచ్చాయి. శనివారం (18వ తేదీ) ఒక్కరోజే 38,754 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు.
మద్యం షాపులకు గతం కంటే ఈసారి దరఖాస్తులు తగ్గిన నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఈసారి ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణలో మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి చూపినట్లు స్పష్టమవుతోంది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి పలువురు దరఖాస్తులు సమర్పించారు. ఒక మహిళా వ్యాపారి ఏకంగా 50 షాపులకు దరఖాస్తు చేయడం విశేషం.