ఏపీకి షాకిచ్చిన తెలంగాణ సర్కార్.. బనకచర్లపై చర్చకు ససేమిరా.. అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో..

Revanth Reddy Chandrababu Naidu
AP-Telangana Banakacherla Project : ఏపీ సర్కార్‌కు తెలంగాణ సర్కార్ బిగ్ షాకిచ్చింది. ఈనెల 16వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ అవసరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపించింది.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈనెల 16వ తేదీన ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సీఎస్‌లకు సమాచారం పంపించింది. ఈ సమావేశం బుధవారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తిభవన్‌లో జరగనుంది. అయితే, ఈ అంశంతోపాటు రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తి శాఖ కోరింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో.. కృష్ణాపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎజెండాను పంపించింది. అయితే, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మంగళవారం ఉదయం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది.
ఈనెల 16న జరిగే సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఈ లేఖలో తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని, ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని కేంద్రానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.