అందరి కళ్లు రంగారెడ్డిపైనే: వేలానికి తెలంగాణ ప్రభుత్వ స్థలాలు

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సర్దుబాట్లు చేయనున్న క్రమంలో రంగారెడ్డిలోని ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వేలం నిర్వహించి వాటిని అమ్మాలనుకుంటోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు, ప్రత్యేకించి కోకాపేట, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, మణికొండ, ఖానామెట్, నర్సింగి, గచ్చిబౌలి, ఉప్పల్, భగత్, మోకిలా, పొప్పల్ గూడ్, బద్వేల్, మియాపూర్‌లో స్థలాలు అమ్మకానికి పెట్టనున్నారు.
ప్రభుత్వ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎకరాకు రూ.15కోట్ల నుంచి రూ.30కోట్ల వరకూ ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వేలం ప్రక్రియ హైదరాబాద్ ఒక్కటే కాకుండా రాష్ట్రం మొత్తం నిర్వహించనున్నారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్, స్టాంప్‌ల ద్వారా ఆయా శాఖలు రెవెన్యూ వచ్చి చేరుతుందని భావిస్తున్నారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మి వాటి ద్వారా వచ్చిన సొమ్మును స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్(ప్రత్యేక అభివృద్ధి నిధులు)గా కేటాయించనున్నట్లు తెలిపారు. ఆ నిధులను ఇరిగేషన్ ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలకు వినియోగించనున్నారు. ఇందుకోసమే ప్రతి జిల్లాలోని ప్రభుత్వ స్థలాల వివరాలను సేకరిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లకు సంబంధించిన 20వేల ఎకరాలు వేలంలోకి వస్తాయి. ఖానామెట్, రాయదుర్గం, మణికొండ, మదీనా గూడ్, గచ్చీబౌలీల్లో స్థలాలు ఉన్నట్లు సమాచారం. పదేళ్లలో ప్రభుత్వ పరిధిలో ఉన్న 9వేల 5వందల ఎకరాల స్థలాల్లో 3వేల ఎకరాలు పలు సంస్థలకు కేటాయించారు.