వైఎస్ షర్మిల పార్టీపై మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

Minister Gangula Kamalakar’s sensational comments : వైఎస్ షర్మిల పార్టీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల వస్తోందని… ఆ తర్వాత జగన్ కూడా వస్తారన్నారు. జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా వచ్చి ప్రచారం నిర్వహిస్తారన్నారు.
తెలంగాణలో ఆంధ్రపెత్తనం మళ్లీ మొదలవుతుందని… దీంతో కొట్లాటలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. ఆంధ్రపెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు..కేసీఆరే మన రక్షకుడన్నారు. అందుకే కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని.. లేకుంటే ఇబ్బందులు తప్పవని కార్యకర్తలను కోరారు.
మరోవైపు తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడు పెంచిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చే లక్ష్యంతోనే అడుగులేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయంగా వడివడిగా అడుగులేస్తూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల.. లేటెస్ట్‌గా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులు, సానుభూతిపరులతో సమావేశమయ్యారు.
వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలుగా మెలిగిన నేతలు షర్మిల కొత్త రాజకీయ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు.
లోటస్‌పాండ్‌లోని నివాసంలో షర్మిలతో భేటీ అయ్యారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి. మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెప్పినప్పటికీ.. పూర్తిగా రాజకీయ అంశాలే భేటీలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ అనుచరులుగా పేరొందిన నేతలకు షర్మిల తొలి ప్రాధాన్యం ఇస్తుండగా.. షర్మిల పార్టీలో రంగారెడ్డి ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లేనని అంటున్నారు.