KTR: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిణామాలపై మాకు ఎలాంటి ఆసక్తి లేదు. అక్కడ జరుగుతున్నది రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ.

KTR: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?

Telangana minister KTR respond in chandrababu naidu arrest in first time

Updated On : September 26, 2023 / 4:22 PM IST

KTR – Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెపిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) స్పందించారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీకి సంబంధించినదని, తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ (Hyderabad) లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అరెస్ట్ కు నిరసనగా ఇక్కడ ర్యాలీలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహాంలో తమ పార్టీ తటస్ఠంగా ఉందని తెలిపారు.

”చంద్రబాబు అరెస్టుతో మాకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్ లో ఒకరితో ఒకరు తలపడండి. అంతేకాని హైదరాబాద్ లో ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు. సున్నితమైన విషయాలను సెన్సిటివ్ గానే హేండిల్ చేయాలి. ఏపీలో ఏమైనా చేసుకోవచ్చు. ఆ రెండు పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదనే ర్యాలీలను అనుమతించడం లేదు.

లోకేష్ నిన్న నాతో ఫోన్ లో మాట్లాడారు. హైదరాబాద్ లో ర్యాలీలకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని చెప్పాను. జగన్, పవన్, లోకేశ్ నాకు దోస్తులే. ఏపీ ప్రజలు ఇక్కడ బాగానే వున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఐటీ కారిడార్ ర్యాలీలు జరగలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఐటీ పరిశ్రమకు ఇబ్బంది కలుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిణామాలపై మాకు ఎలాంటి ఆసక్తి లేదు. అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ. చంద్రబాబు నాయుడు గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. న్యాయస్థానంలో ఉన్న అంశంపై నేను మాట్లాడను. మా పార్టీ నాయకులెవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అది పార్టీ స్టాండ్ కాద”ని కేటీఆర్ అన్నారు.

Also Read: ప్రధాని మోదీకి పాలమూరులో కాలు మోపే అర్హత లేదు.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : మంత్రి కేటీఆర్