కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలు జనాల్లోకి వెళ్లడం లేదా? అనుకున్నంత మైలేజ్‌ రావడం లేదనుకుంటున్నారా?

పవర్‌లో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా చాలా విషయాల్లో పైచేయి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట కాంగ్రెస్ పెద్దలు.

కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలు జనాల్లోకి వెళ్లడం లేదా? అనుకున్నంత మైలేజ్‌ రావడం లేదనుకుంటున్నారా?

Updated On : October 9, 2024 / 8:59 PM IST

ఇంకో రెండు నెలలు అయితే పార్టీ పవర్‌లోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ పది నెలల్లోనే ఏంతో చేశాం. రుణమాఫీపై మాట నిలబెట్టుకున్నాం..ఫ్రీ బస్సు, కరెంట్ అమలు చేస్తున్నాం.. అయినా ఎందుకు పార్టీ, ప్రభుత్వానికి అనుకున్నంత మంచి పేరు రావడం లేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వ పెద్దలను కలవరపెడుతోందట.

ప్రజా సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నా ఎక్కడో తేడా కొడుతోందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఆరు గ్యారెంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు తీసుకున్నా ఎందుకో వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నామనే అంతర్మథనం కాంగ్రెస్‌ నేతల్లో మొదలైందట.

పవర్‌లో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా చాలా విషయాల్లో పైచేయి సాధించ లేకపోతున్నామని అనుకుంటున్నారట కాంగ్రెస్ పెద్దలు. ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనకబడిపోతున్నామని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మంచి కార్యక్రమాలు చేపడుతున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడం లేదన్న చర్చ ఉందట.

విమర్శల్ని తిప్పికొట్టలేకపోతున్నామన్న భావన
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉన్న పార్టీ క్యాడర్ అంతా..ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సైలెంట్‌గా ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆఖరికి ప్రతిపక్ష పార్టీల విమర్శల్ని కూడా దీటుగా తిప్పికొట్ట లేకపోతున్నామన్న భావన సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతల్లో ఉందట. పార్టీ సోషల్ మీడియాలో గతంలో పనిచేసిన టీమే ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించడంలో వెనుకబడ్డామన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.

ఎన్నికలకు ముందు ముఖ్యనేతల నుంచి మొదలు సామాన్య కార్యకర్త వరకు అంతా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుని ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేవారని.. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు సైలెంట్ అయిపోయారో అర్ధం కావడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ ప్రక్షాళన దిశగా పీసీసీ కొత్త చీఫ్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని తెలుస్తోంది. అధికార ప్రతినిధుల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు చెబుతున్నారు.

పబ్లిక్ మూడ్‌కు తగ్గట్లుగా వెంట వెంటనే డెసిషన్స్!
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు ప్రతిపక్షాలని గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారన్న అభిప్రాయం ఉండటంతో..సీనియర్ ఎమ్మెల్యేలకు అధికార ప్రతినిధి పదవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధులుగా ఉంటే వాళ్ళ పలుకుబడి, వాగ్దాటి, అవగాహనతో మీడియాలో ఫోకస్ అవడంతో పాటు ప్రతిపక్షాలకు గట్టిగా సమాధానం చెప్పినట్టు అవుతుందని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ భావిస్తున్నారట. అంతే కాకుండా సోషల్ మీడియాను మరింత యాక్టివేట్‌ చేయాల్సిన అవసరం ఉందని కూడా అనుకుంటున్నారట.

ప్రభుత్వ కార్యక్రమాలు అనుకున్నంత స్థాయిలో జనంలో వెళ్లడం లేదని.. ఇకపై స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయిపోయారట. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని పబ్లిక్ మూడ్‌కు తగ్గట్లుగా వెంట వెంటనే డెసిషన్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అపోజిషన్‌ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టి డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

AP Politics: వరద సాయం సెంట్రిక్‌గా ఏపీ రాజకీయం