Telangana Covid-19 Cases: తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు, రెండు మరణాలు
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్‌తో మరో ఇద్దరు చనిపోయారు.

telangana reports 204 fresh covid 19 cases: తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్‌తో మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,656కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 16,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
కరోనా నుంచి నిన్న 170 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,851కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,015 ఉండగా.. వీరిలో 624 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 92,99,245మందికి కరోనా పరీక్షలు చేశారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి. ఆదివారం(మార్చి 14,2021) 26 వేలకుపైగా కేసులు నమోదుకాగా.. నిన్న 24వేల 492 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8.73లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.
2లక్షలు దాటిన యాక్టివ్ కేసులు:
గడిచిన 24 గంటల్లో 131 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,58,856కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 23వేల 432కి పెరిగింది. కొత్తగా 20,191 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,27,543కు చేరి.. రికవరీ రేటు 96.65గా నమోదైంది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ:
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అక్కడ అత్యధిక కేసులు రికార్డ్ అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్రకే చెందినవి కావడం గమనార్హం.
దేశంలో మరోసారి కరోనా విజృంభించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందు ముందు ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందోనని కంగారుపడుతున్నారు. అయితే.. భయపడాల్సిన పని లేదని, అలాగని అలసత్వం పనికిరాదని నిపుణులు చెబుతున్నారు. నిబ్బరం కావాలి గానీ నిర్లక్ష్యం తగదన్నారు. కరోనా జబ్బు విషయంలో ఇప్పుడిలాంటి విజ్ఞతే అవసరం అని తేల్చి చెబుతున్నారు. మహా సునామీ నుంచి బయటపడినా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని హెచ్చరించారు.
నివురుగప్పిన నిప్పులా ప్రమాదం పొంచే ఉందన్నారు. విదేశాల్లో మాదిరిగా మనదగ్గరా మరోసారి కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం మనమే అంటున్నారు. పని గట్టుకొని వైరస్ మన దగ్గరికేమీ రావట్లేదు, వైరస్ ఉన్న చోటుకి మనమే వెళ్తున్నాం, అంటుకునేలా చేసుకుంటున్నాం అని చెబుతున్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే కుదుట పడిన పరిస్థితి దిగజారటం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
* బయటకు ఎక్కడికి వెళ్లినా విధిగా మాస్కు ధరించాలి.
* ఇతరులకు కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి.
* తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సబ్బుతో కడుక్కునే వీలు లేకపోతే చేతులకు శానిటైజర్ రాసుకోవాలి.
* వీటిని కచ్చితంగా పాటించటం మనందరి విధి. బాధ్యత. వీటితో కరోనా జబ్బు బారినపడకుండా చాలావరకు కాపాడుకోవచ్చు.
టీకా తీసుకున్నా జాగ్రత్తలు తప్పనిసరి:
టీకా తీసుకున్నాం కదా, ఇక మునుపటిలా ఎక్కడికైనా వెళ్లొచ్చని అనుకోవటానికి లేదని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్‌ఫెక్షన్ అసలే రాదని చాలామంది భావిస్తుంటారని, ఇది పూర్తిగా నిజం కాదన్నారు. టీకాతో జబ్బు తీవ్రం కావటం పూర్తిగా ఆగిపోవచ్చు గానీ ఇన్‌ఫెక్షన్ తలెత్తకూడదనేమీ లేదన్నారు. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన ఒకొకరిలో ఒకోలా ఉంటుందని, వ్యాక్సిన్ సామర్థ్యం 80% అనుకుంటే.. దీన్ని తీసుకున్నవారిలో నూటికి 80 మందికి రక్షణ కల్పిస్తుందని అర్థం. వీరికి ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా రక్షణ లభించొచ్చు లేదూ ఇన్‌ఫెక్షన్ తలెత్తినా రోగనిరోధక వ్యవస్థ వైరస్‌ను త్వరగా నిర్మూలించటం వల్ల లక్షణాలేవీ తలెత్తకపోవచ్చు. మిగతా 20% మందికి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశమైతే ఉంటుంది. కానీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సినంత తీవ్రం కాకపోవచ్చు.
రెండు డోసులు తీసుకున్నాక 2వారాల తర్వాతే రక్షణ:
టీకా రెండు మోతాదులు తీసుకున్నాక 2 వారాల తర్వాతే పూర్తి రక్షణ లభిస్తుంది. టీకా తీసుకున్నవారికీ వైరస్ సోకొచ్చు. అంత ఎక్కువగా కాకపోయినా వీరి నుంచీ ఇతరులకు వైరస్ వ్యాపించొచ్చు. అందువల్ల మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే. ఎక్కువ మందికి టీకాలు ఇవ్వటం వల్లనో, సామూహిక రోగనిరోధకశక్తి సంతరించుకోవటం వల్లనో మరో 3, 4 నెలల్లో కరోనా నుంచి పూర్తిగా బయటపడే అవకాశముంది. కనీసం అప్పటివరకైనా అప్రమత్తంగా ఉండటం మంచిది. లేకపోతే పరిస్థితి దిగజారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.