సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 6, 2019 / 04:01 AM IST
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

Updated On : October 6, 2019 / 4:01 AM IST

 బతుకమ్మ ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ పూల వేడుకల్లో.. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగకు నగరం సిద్ధమైంది. బతుకమ్మ ఘాట్‌ల దగ్గర విద్యుత్ దీపాలు అమర్చారు. బతుకమ్మల నిమజ్జనం కోసం చెరువులు, కుంటలతో పాటు నీటి తొట్టీలు ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం భారీ సంఖ్యలో మహిళలచే బతుకమ్మ పండుగ నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేశాయి.

ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మ శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభాయాత్ర జరిగే మార్గంతో పాటు నిమజ్జనం చేసే బతుకమ్మ ఘాట్ వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఎల్బీ స్టేడియానికి మహిళలు చేరుకొని బతుకమ్మలను పేరుస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3 గంటలకు ఎల్బీస్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలతో ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వచ్చి బతుకమ్మ ఆడుతారు. అనంతరం బతుకమ్మ ఘాట్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.

దీనికోసం బతుకమ్మ ఘాట్‌ను శుభ్రం చేసి శుభ్రమైన నీటితో నింపినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం(అక్టోబర్-6,2019) సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపు ఇచ్చారు.