Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు వచ్చేది అప్పుడే.!
టెన్త్ పరీక్షలు పూర్తికావటంతో ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ చివరి వారంలోనా.. మే నెల మొదటి వారంలో టెన్త్ ఫలితాలు..

Telangana Students
Telangana SSC Results: టెన్త్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవి. తెలంగాణలో మార్చి 21న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 2(బుధవారం)తో ముగిశాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. బుధవారంతో జరిగిన సోషల్ పరీక్షతో టెన్త్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో హాస్టల్స్ లో ఉంటూ, సిటీలకు వచ్చి చదువుకునే విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు.
టెన్త్ పరీక్షలు పూర్తికావటంతో ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, టెన్త్ ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెలలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ (https://www.bse.telangana.gov.in) లో తనిఖీ చేసుకోవచ్చు. ప్రస్తుతం.. ఓరియంటల్ సైన్స్‌కు సంబంధించిన రెండు పరీక్షలు ఈ నెల 3, 4 తేదీల్లో జరుగుతాయి. వాటికి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని అధికారులు తెలిపారు.
టెన్త్ పరీక్షల్లో పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ తెలిపింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలను సిబ్బంది లీక్ చేశారనే ఆరోపణలతో కలెక్టర్ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే నకిరేకల్ గురుకుల పాఠశాలల్లో తెలుగు ప్రశ్నాపత్రం లీకైన ఘటనలో అధికారులను విధుల నుంచి తొలగించారు. అయితే, ఈ సంఘటనలో తన ప్రమేయం లేదని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేయడంతోపాటు ఆమె హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.