ఇళ్లను కూలిస్తే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తాం..!- రామంతపూర్‌లో ఉద్రిక్తత
రాజేంద్రనగర్, గండిపేట పరిధిలోని ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది.

Hydra (Photo Credit : Google)
Hydra : హైదరాబాద్ రామంతపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇళ్లను కూల్చవద్దని స్థానిక మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లను కూల్చుకోవడానికేనా ప్రభుత్వానికి ఓట్లు వేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూలిస్తే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు రామంతపూర్ మహిళలు.
Also Read : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్..! త్వరలో అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేత..
మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు ఉప్పల్ ఎమ్మార్వో. చైతన్యపురి డివిజన్ లోని సత్యనగర్ లోని కట్టడాలను పరిశీలించేందుకు రావడంతో స్థానికులు నిరసనకు దిగారు. రాజేంద్రనగర్, గండిపేట పరిధిలోని గంధంగూడ, బైరాగిగూడ ప్రాంతాల్లోనూ, మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది.
మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. వాటిని మార్క్ చేస్తున్నారు. ఉదయమే ప్రారంభించిన ఈ సర్వేకు సంబంధించి అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా రామంతపూర్, నాగోల్ చైతన్యపురి ప్రాంతంలో ఉండే సత్యనగర్ ఏరియాలోని కాలనీ వాసుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అక్కడ ఉండే జైనప్రియ అపార్ట్ మెంట్ వాసులు తమ నివాసం ఎక్కడ కూడా మూసీలో లేదని, అయినా ఎందుకు మార్క్ చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే పరిసర ప్రాంతాల్లో ఉండే మరికొన్ని ఇళ్లకు కూడా మార్కింగ్ చేయడంపై అక్కడి నివాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ ప్రాంతంలో నిర్మాణాలు చాలా హైట్ లో ఉంటాయి. మూసీ నది గర్భంలో లేవు. మరి ఎందుకు వీటికి మార్క్ చేస్తున్నారు అనేది ప్రశ్నగా మారిందంటున్నారు స్థానికులు. ప్రధానంగా చాదర్ ఘాట్ ప్రాంతంలో మొత్తం ఇళ్లు మూసీ రివర్ బెడ్ లో ఉన్నాయి. అయినప్పటికి అక్కడ కొన్నింటికి మాత్రమే అధికారులు మార్క్ చేశారని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతం మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోకి వస్తుందని, మొత్తం 332 నిర్మాణాలు రివర్ బెడ్ లో ఉన్నట్లు చెప్పారు. కానీ ఉప్పల్ మండలంలోనే దాదాపుగా 200 నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. వాటన్నింటిని కాకుండా పక్కన ఉన్న నిర్మాణాలకు కూడా మార్కింగ్ చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గందరగోళం సృష్టించకుండా.. మూసీ నదికి ఎంతవరకు అవసరమో అంతవరకు నిర్మాణాలను కూల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.