TG Assembly: జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఇష్యూ.. స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఎత్తివేయాలని..

BRS MLAs Meet The Speaker
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండోరోజు కూడా చర్చ కొనసాగుతోంది. అయితే, సభ ప్రారంభం కాకముందు స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానందలు కలిశారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. జగదీశ్ రెడ్డి స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అన్యాయం, అక్రమం అని పేర్కొన్నారు. సభాసంప్రదాయాలు ఎక్కడా ఉల్లంఘించలేదని, జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అదేవిధంగా జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ విషయంపై అసెంబ్లీలోనూ హరీశ్ రావు లేవనెత్తారు.
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పున:పరిశీలన చేయాలని స్పీకర్ ను హరీశ్ రావు కోరారు. జగదీశ్ రెడ్డి సభాపతిని అగౌరవంగా మాట్లాడలేదని, ఆయనకు అవకాశం ఇచ్చిఉంటే వివరణ ఇచ్చేవారని అన్నారు. మాకు మీరన్న, స్పీకర్ చైర్ అన్నా అపారమైన గౌరవం ఉందని, తమరిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సమయంలో కేసీఆర్ సహకరించారని హరీశ్ రావు గుర్తు చేశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ఈ సందర్భంగా స్పీకర్ ను హరీశ్ రావు కోరారు.