Telangana: తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపుపై క్లారిటీ వచ్చేసింది.. సంస్థ సీఎండీ ఏమన్నారంటే?
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల ప్రతిపాదనలు..

Electricity
Electricity Tariff Hike: ఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి డిస్కంలు నివేదిస్తాయి. ఈ ఏడాది పెంచడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపించాయి. అయితే, ఛార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ప్రభుత్వం ఇప్పటికే వారి ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే, వేసవి కాలం వస్తుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీల మోత తప్పదన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల ప్రతిపాదనలు ఏమీ లేవని, విద్యుత్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. టైం ఆఫ్ డే (టీవోడీ) ధరల్లో ఎలాంటి మార్పు లేదని, గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే ఎల్టీ, హెచ్టీ వినియోగదారులకు మాత్రం సాధారణ టారిఫ్ కంటే యూనిట్ కు రూ.0.66 గ్రీన్ టారిఫ్ విధింపు ఉంటుందని అన్నారు. ఓపెన్ యాక్సెస్ ఎనర్జీ మేరకు వినియోగదారులకు వర్తించే ఎనర్జీ ఛార్జీల్లో 10శాతం చొప్పున స్టాండ్ బై ఛార్జీల విధింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
టీజీఎన్పీడీసీఎల్ 2025-26 సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రపోజల్స్ పై టీజీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున అధ్యక్షతన బుధవారం హన్మకొండ కలెక్టరేట్ లో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులు, వేసవి కాలంలో యాక్షన్ ప్లాన్, ఇతర సమగ్ర సమాచారాన్ని వివరించారు.