Bonalu Festival: నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం
ఆషాఢ మాసం వచ్చేసింది.. బోనాల పండుగను తెచ్చేసింది.. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నేడు ఆదివారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో.. ఈ ఉత్సవం నగరమంతటా మొదలవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం లష్కర్‌లో ఆ తర్వాత లాల్ దర్వాజా, ధూళ్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో నెలంతా ఈ బోనాల పండుగ జరుపుకోనున్నారు.

The Bonalu Festival Begins From This Sunday
Bonalu Festival: ఆషాఢ మాసం వచ్చేసింది.. బోనాల పండుగను తెచ్చేసింది.. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నేడు ఆదివారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో.. ఈ ఉత్సవం నగరమంతటా మొదలవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం లష్కర్‌లో ఆ తర్వాత లాల్ దర్వాజా, ధూళ్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో నెలంతా ఈ బోనాల పండుగ జరుపుకోనున్నారు. నగరాల్లో తర్వాత జిల్లాల్లోనూ ఈ బోనాల పండుగను జరుపుకుంటారు.
చెడును దూరం చేసి మంచిని కాపాడిన దేవతలకు.. ముఖ్యంగా ఎన్నో అవతారాల్లో దుష్ట సంహారం చేసిన దేవిని భక్తి భావంతో పూజించటమే బోనాలు ఉత్సవాలు. తనకు తెలియని, తన కళ్లముందు జరుగుతున్న అద్భుత సంఘటనలను చూస్తూ వాటన్నింటికీ ఊహాశక్తిని మిళితం చేసి మనిషి ఎన్నో శక్తులను ప్రతిపాదించుకున్నాడు. తనను మించిన, తనను నడిపిస్తున్న ప్రతిదీ భగవత్ రూపంగా భక్తితో ఆరాధిస్తున్నాడు. ఈ క్రమంలో సృష్టి ఉద్భవాన్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ఊహించారు.
బోనం అంటే భోజనం. అమ్మవారికి నైవేద్యాన్ని కృతజ్ఞతతో సమర్పించే పండగ బోనాలు. నిత్యం ప్రకృతి రూపంలో, ప్రతి కదలికలో మనల్ని కాపాడే అమ్మవారు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తుంది. ఆ దేవతలను ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ బోనంతో పాటు, రకరకాల ఉయ్యాల తొట్టెలను సమర్పిస్తారు. మనిషి జీవితానికి ప్రతీకగా చాలా మంది మట్టి కుండలో బోనాన్ని సమర్పిస్తారు. బెల్లం, పాలు, పెరుగు లాంటి వాటితో కలిపి చేసిన అన్నాన్ని బోనం కుండలో పెట్టి వేపాకులతో అలంకరించి దాని పైన మూతలో దీపాన్ని ఉంచుతారు.
మొదటగా దాన్ని ఇంట్లో దేవుడి దగ్గర ఉంచి ఇంటిల్లిపాదీ భక్తిశ్రద్ధలతో పూజించి తర్వాత బోనం తలకెత్తుకుని వెళ్లి సాక పోస్తారు. బోనాలని ఆషాఢ మాసంలో ఆది, సోమవారాల్లో జరపడం విశేషం కాగా ఈ ఏడాది ఈ ఆదివారంతో ఈ బోనాలు ప్రారంభం కానున్నాయి. కాగా గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అట్టహాసంగా బోనాలను నిర్వహించుకోలేకపోగా.. ఈ ఏడాది మాత్రం ఘనంగాగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్లు మంజూరు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ బోనాల ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు.