Munugode Bypoll: మునుగోడులో స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. అభ్యర్థిని ప్రకటించిన ఏఐసీసీ
మునుగోడు నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసింది.

munugode bypoll
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉపపోరులో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నేతలు జోరు పెంచారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లేందుకు పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించింది. మనుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఎంపిక చేసినట్లు ముఖుల్ వాస్నిక్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
Congress Candidate Munugodu By-Poll : మునుగోడు ఉప ఎన్నికలు..ఈనెలాఖరులోపు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విధితమే. కాంగ్రెస్ ను వీడి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఉప ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారపర్వంలో వేగం పెంచేందుకు ఆ పార్టీ నేతలు కార్యాచరణ మొదలు పెట్టారు.

munugode bypoll congress candidate announced
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నెలబెట్టాలనేదానిపై కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. నలుగురు పేర్లతో టీపీసీసీ ఢిల్లీకి జాబితాను పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతి మునుగోడు ప్రజలకు సుపరిచితురాలు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించడంతో స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకుని ఆయన గెలుపు కోసం పనిచేశారు.