రేవంత్‌రెడ్డికి అడ్డుతగిలితే చంపేస్తామని వీహెచ్ కు బెదిరింపు కాల్

Threat call to Congress senior leader V.Hanumantrao to kill : కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తుంటే ఎందుకు అడ్డుపడతావని ఆగంతకుడు ఫోన్‌లో బెదిరింపులకు దిగాడు. వీహెచ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు.
తనకు వచ్చిన బెదిరింపు కాల్‌పై వీహెచ్… సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ గురించి మాట్లాడితే చంపుతామని బెదిరించినట్టు వీహెచ్ ఆరోపిస్తున్నారు. ఆగంతకుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతకముందు వీ.హనుమంతరావు పార్టీ అధిష్టానం పైనా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్టీ అధిష్టానం గత రెండేళ్లనుంచి ఎన్నిసార్లు అడుగుతున్నా తనకు అపాయింట్ మెంట్ ఇవ్వటంలేదని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రంలోని కొంత మంది నాయకులు నాపై హై కమాండ్ కు చెడుగా చెప్పారని అన్నారు. వరుస పరాజయాల పాలవుతున్నా పార్టీ లో రివ్యూ జరగటం లేదని ఆయన అన్నారు.
హైకమాండ్ నన్ను అవమానించిందని ఆయన అన్నారు. పార్టీలో బీసీ నాయకులను పట్టించుకోవటం లేదని…. పార్టీ అధ్యక్షురాలు సోవియాగాంధీకి సమాధి కట్టినోడికి పీసీసీ పదవి కట్టబెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్, టీడీపీ లోంచి పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు.
వీహెచ్ చేసిన వ్యాఖ్యలు చూస్తూంటే హై కమాండ్ తో తాడోపేడే తేల్చుకోటానికి సిధ్దమైట్లు కనిపిస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రేవంత్ రెడ్డి పై ఇప్పటికే చాలా కేసులున్నాయని… టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ గురించి నిజాలు చెప్పకుండా దాచి పెట్టాడని… ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లివచ్చిన సంగతి అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేశారు.
రేవంత్ పై ఓటుకు నోటు, మనీ లాండరింగ్ కేసు లు ఉన్నాయని, రేవంత్ తమ్ముడు హరిజనుల భూకబ్జాలకు పాల్పడ్డాడడని….ఆయన మూలంగా షేక్ పేట తహసిల్దార్ సస్పెండ్ అయ్యాడని వివరించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనూ, ఢిల్లీ స్ధాయిల్లోనూ మీడియాను మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమేపి అగ్రకులాల పార్టీగా మారుతోందని బడుగు బలహీన వర్గాల వారిని దూరం చేస్తున్నారని… ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కాదని మూడు పార్టీలు మారి, తెలంగాణకు బద్ద శత్రువైన రేవంత్ కు టీపీసీసీ పదవి ఇవ్వటం దారుణమని అన్నారు.