పాతబస్తీ అగ్నిప్రమాదం: హృదయ విదారకం.. ఒకేసారి మంటల్లో కాలిపోయిన మూడు తరాలవారు
అగ్ని ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో పాటు వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీ గుల్జార్ హౌజ్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగి ఆదివారం ఉదయం 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారందరూ ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు. గుల్జార్‌హౌజ్ వద్ద ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోదీ(73)కి జీ ప్లస్ 2 బిల్డింగ్ ఉంది.
కింద పోర్షన్‌లో వారికి 3 ముత్యాల దుకాణాలు ఉన్నాయి. ప్రహ్లాద్ మోదీ తాత దాదాపు 150 ఏళ్ల క్రితం ముత్యాల వ్యాపారం చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. గుల్జార్ హౌజ్ వద్ద ఓ బిల్డింగ్ కొని వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ వ్యాపారాన్ని ప్రహ్లాద్ మోదీ తండ్రి పూనంచంద్ కొనసాగించారు.
Also Read: గుల్జార్ హౌజ్ చరిత్ర ఏంటో తెలుసా? అది ఒక ఫౌంటెయిన్.. దాన్ని ఎందుకు కట్టారు?
అతడి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రహ్లాద్ మోదీ, అతడి సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీ తీసుకున్నారు. బిల్డింగ్‌లోని కింది భాగంలో ముత్యాల వ్యాపారం చేస్తున్న ప్రహ్లాద్ మోదీ, అదే బిల్డింగ్‌లోని పై రెండు అంతస్తుల్లో కొడుకులు, మనుమలతో కలసి ఉంటున్నారు. ప్రహ్లాద్ మోదీకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు.
చిన్న కుమారుడు పంకజ్ మోదీ, భార్య ముగ్గురు పిల్లలతో తండ్రి వద్దే ఉంటున్నాడు. అగ్ని ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో పాటు వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు మృతి చెందడంతో బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.