Mahesh Kumar Goud : ఫిబ్రవరిలో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన, అక్కడ భారీ బహిరంగ సభ..
రాష్ట్రంలో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అంశంపై వివరించారు.

Mahesh Kumar Goud : ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండో వారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నట్లు తెలిపారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఖమ్మం లేదా సూర్యాపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెలఖారు వరకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేయాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సూచించినట్లు పీసీసీ చీఫ్ తెలిపారు.
జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ మంత్రులతో ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ సమావేశం అయ్యారు. గంటనర్న పాటు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
‘ప్రధానంగా పీసీసీ కార్యవర్గ కూర్పు, విధివిధానాల మీద వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే విధంగా కాస్ట్ సెన్సస్ జరుగుతున్న తీరు తెన్నులు, కాస్ట్ సెన్సస్ పూర్తైన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది. దాంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అంశంపై వివరించారు.
మంత్రులు ఇంఛార్జ్ గా ఉన్న జిల్లాలలో నిరంతరం పర్యటించి అక్కడున్న ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా మీటింగ్ లు పెట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిందిగా మంత్రులకు సూచించడం జరిగింది. గ్రామస్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉన్నవారికి పట్టం కట్టాల్సిందిగా.. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పొజిషన్ ను బలోపేతం చేస్తూ వారికి వచ్చే ఎన్నికల నాటికి సీఈసీలో పిలవడం జరుగుతుంది. కాబట్టి సమర్థవంతమైన నాయకులను డీసీసీలో అధ్యక్షులుగా నియమించుకోవాల్సిందిగా సూచించారు.
రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ పైనా చర్చించడం జరిగింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో రాహుల్ తెలంగాణకు వస్తారు. సూర్యాపేటలో లేదా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
Also Read : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ దూకుడు.. ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా?