Revanth Reddy : రేవంత్ రెడ్డిని చూడగానే వీహెచ్ చిరునవ్వు

Revanth Reddy
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఆయన వరుసగా పార్టీ పెద్దలను కలుస్తున్నారు. సోమవారం పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పార్టీ విషయాలను చర్చించారు. అనంతరం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీ హనుమంత రావును పరామర్శించారు. రేవంత్ ని చూడగానే వీహెచ్ చిరునవ్వు నవ్వారు. ఇదే సమయంలో వీహెచ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు రేవంత్.
పరామర్శ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.. వీహెచ్ ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆరోగ్యం పరిస్థితి సరిగా లేకపోయిన తనతో ప్రజా సమస్యలపై మాట్లాడారని వివరించారు. దళితుల తరపున పోరాటం చేయాలనీ వీహెచ్ తెలిపినట్లు రేవంత్ వివరించారు. దళితుల అభివృద్ధికి కృషి చేసేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత తమపైనే ఉందని హనుమంతరావు గుర్తు చేశాడని తెలిపారు రేవంత్.
కాగా వీహెచ్, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఉత్తమ్ రాజీనామా చేసిన నాటినుంచి పీసీసీ చీఫ్ ఎన్నిక గురించి వీహెచ్ మాట్లాడుతూనే ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ ని నియమిస్తారని గతంలో వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించారు. వచ్చి పోయేవాళ్లకు పదవులు ఇవ్వడం వలన పార్టీకి నష్టం జరుగుతుందని తెలిపారు.
మొదటి నుంచి రేవంత్ రెడ్డితో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు వీహెచ్.. ఇక తాజాగా రేవంత్, వీహెచ్ నీ కలవడంతో ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గించినట్లుగా అర్ధమవుతుంది. తనను కలిసేందుకు వచ్చిన రేవంత్ రెడ్డికి ప్రజల సమస్యల గురించి తెలిపారు వీహెచ్