కేసీఆర్ అంటే కోట్లాడే నేత వస్తేనే.. కొత్త టీపీసీసీ చీఫ్‌ రావాల్సిందే?

  • Published By: sreehari ,Published On : August 19, 2020 / 08:29 PM IST
కేసీఆర్ అంటే కోట్లాడే నేత వస్తేనే.. కొత్త టీపీసీసీ చీఫ్‌ రావాల్సిందే?

Updated On : August 19, 2020 / 9:14 PM IST

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రథసారథి కావాలి. అంటే ఓ మంచి మాస్ లీడర్ కావాలి. కేసీఆర్ అంటే కొట్లాడే నాయకుడు రావాలి. అప్పుడే పార్టీకి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. లేదంటే ఇదే పాత పరిస్థితే ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

కొత్త ఉత్సాహం రావాలంటే కొత్త చీఫ్‌ రావాల్సిందేనని చెబుతున్నారు. పాము చావద్దు కర్ర విరగొద్దు చందంగా సాగే ఉద్యమాలు కాదు… తాడో పేడో తెల్చుకునేలా పోరాటాలు చేయాలంటున్నారు. అలాంటి సత్తా ఉన్న వాళ్లకే పిసిసి పగ్గాలు అప్పజెప్పాలని సూచిస్తున్నారు.



ఆ వ్యక్తికే ఛాన్స్ :
కరోనా నేపథ్యంలో దానికి సంబంధించిన సమస్యలపైనే పోకస్ పెట్టిన అధిష్టానం తాజాగా.. పార్టీ నాయకత్వం గురించి కూడా అలోచిస్తున్నట్లు హస్తిన వర్గాల సమాచారం. ఇలా అక్కడ వార్ రూమ్‌లో చర్చ మొదలైందో లేదో ఇక్కడ గాంధీభవన్‌లో ఏకంగా బ్యానర్లు రెడీ అవుతున్నాయట.



ఇదే సమయంలో అగ్ర నాయకత్వం ఈ విషయంలో తమ అభిప్రాయం కూడా తెలుసుకోవాలని కింది స్ధాయి కేడర్ అంటోంది. అప్పుడే తమ అభిప్రాయలను నేరుగా చెప్పుకునే అవకాశం వస్తుందని భావిస్తోంది. తమ కోరిక ప్రకారం పార్టీకి పునరుజ్జీవం పోయాలంటే డైనమిక్‌గా పని చేసే వ్యక్తికి చాన్స్ ఇవ్వాలని అంటున్నారు.

పీసీసీ ఇవ్వాలని :
వాస్తవానికి పార్టీ కోసం ప్రస్తుతం చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాగానే కష్టపడ్డారు. కాకపోతే ఇప్పటికే ఐదేళ్లు పూర్తి కావడంతో కొత్త నాయకత్వం అయితే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. మరో వైపు ప్రస్తుతం కేడర్‌కి బూస్టప్ ఇచ్చి.. పార్టీ జెండా మోసే వారిలో ధైర్యం నింపితే చాలు.. మిగాతాది ప్రజలే చూసుకుంటారంటున్నారు.



అలాంటి వారిలో కొంతమంది పేర్లు ఉన్నప్పటికీ అదే స్ధాయిలో వారికి బలహీనతలు కూడా ఉండడంతో ఎవరు పేరు చెప్పాలో అర్ధం కాక సతమతమౌతున్నారట. తమకు పీసీసీ ఇవ్వాలని అని అడుగుతున్న వారి పట్ల అభిప్రాయ సేకరణ చేయడం కుదరదు కాబట్టి తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పలేక లేఖలు, మొయిల్స్ ద్వారా హైకమాండ్‌కి పంపుతున్నారట. మరి అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాల్సిందే.