Revanth vs Harish: అసెంబ్లీలోనే తేల్చుకుందామన్న రేవంత్.. సై అన్న హరీశ్‌

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ కాంగ్రెస్‌పై మండిపడుతోంది బీజేపీ.

Revanth vs Harish: అసెంబ్లీలోనే తేల్చుకుందామన్న రేవంత్.. సై అన్న హరీశ్‌

Debate On Krishna Water Dispute

Updated On : February 4, 2024 / 10:00 PM IST

తెలంగాణలో వాటర్‌ వార్‌ హీటెక్కిస్తోంది. అధికారంలోకి రాకముందు నుంచే కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏకంగా విచారణకు ఆదేశించింది. తాజాగా కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి కారణం కేసీఆర్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించడం గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది.

అయితే.. పదేళ్ల పాలనలో ఏనాడూ అందుకు ఒప్పుకోలేదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింతగా పెరిగింది. పనిలో పనిగా బీజేపీ సైతం రెండు పార్టీలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు ప్రారంభించింది.

కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో సాగు నీటి సమస్య పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గోదావరి జలాల వినియోగం కోసం ప్రాణహిత-చేవెళ్లను రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడం.. ప్రతిపక్షాలకు ఒక ప్రచార అస్త్రంగా మారింది.

పూర్తిస్థాయి విచారణ

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల లోటుపాట్లపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసేందుకు కాంగ్రెస్‌కు ఇదో అస్త్రంగా మారిపోయింది.

ఓవైపు కాళేశ్వరం వివాదం నడుస్తూ ఉండగానే.. కృష్ణా జలాల వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. నదీ జలాల వినియోగం విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం హక్కులు కోల్పోవాల్సి వస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. రేవంత్‌ సర్కారుకు ముందుచూపు లేకుండా.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు KRMB పరిధిలోకి ఇచ్చేందుకు అంగీకరించిందని మండిపడుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. దీనివల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరగడంతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతోందని కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తోంది బీఆర్‌ఎస్‌.

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందని… కేసీఆర్ సూచనతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారన్నారు. అంతేకాదు.. KRMBకి ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిధులు విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేశారని ఆరోపిస్తున్నారు రేవంత్‌రెడ్డి.

ఆరోపణలు షురూ
అయితే.. కేసీఆర్‌ వల్లే నీటి వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో మరింత దూకుడు పెంచింది బీఆర్‌ఎస్‌. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ అంశాన్ని కాంగ్రెస్‌ నేతలైన జైరాం రమేశ్‌, జైపాల్‌రెడ్డి ప్రతిపాదించిన విషయాన్ని గులాబీ పార్టీ తెరపైకి తీసుకువస్తోంది. ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్‌తోపాటు.. అటు కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసేందుకు రెడీ అవుతున్నాయంటూ ఆరోపణలు మొదలు పెట్టింది బీఆర్‌ఎస్‌.

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ కాంగ్రెస్‌పై మండిపడుతోంది బీజేపీ. ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ కుంభకోణాలపై విరుచుకుపడ్డ రేవంత్‌రెడ్డి.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను బతికించేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ వాటర్‌ వార్‌ చర్చనీయాంశంగా మారింది. KRMB అంశంతో రెండు జాతీయ పార్టీలను టార్గెట్‌ చేసేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైతే.. కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశాలతో గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు రెడీ అయ్యింది కాంగ్రెస్‌. ఇవే అంశాలను తమకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది బీజేపీ.

Pawan Kalyan: జగన్ తనను తాను ఇలా పోల్చుకోవడం హాస్యాస్పదం: పవన్ పవర్‌ఫుల్ స్పీచ్