Telangana New Cabinet : మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు పెద్దపీట.. ముగ్గురికి మంత్రి పదవులు.. ఆ ముగ్గురి ప్రత్యేక ఏమిటంటే?

రేవంత్ మంత్రి వర్గంలో ఖమ్మం జిల్లాకు పెద్దపీట దక్కింది. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.

Telangana New Cabinet : మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు పెద్దపీట.. ముగ్గురికి మంత్రి పదవులు.. ఆ ముగ్గురి ప్రత్యేక ఏమిటంటే?

Ponguleti Bhatti Tummala

Updated On : December 7, 2023 / 2:20 PM IST

Thummala and Batti Ponguleti : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.21 గంటలకు గవర్నర్ తమిళిసై రేవంత్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.  ఆ తరువాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, 10మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ మంత్రి వర్గంలో ఖమ్మం జిల్లాకు పెద్దపీట దక్కింది. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాకు మూడు మంత్రి పదవులు రావడటంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, వీరిలో తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంది. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు తొలిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : Telangana New Minister : మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నది వీరే.. స్వయంగా ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎంగా భట్టి

ముగ్గురు ఖమ్మం జిల్లా నుంచే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించగా.. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. అయితే, రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల, భట్టి విక్రమార్క, పొంగులేటి ముగ్గురు ఖమ్మం జిల్లా నుంచి గెలుపొందిన నేతలు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ పై విజయం సాధించారు. భట్టి విక్రమార్క వరుసగా నాలుగో సారి మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొంగులేటి.. బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై విజయం సాధించారు.

Also Read : Congress six guarantees : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై అందరి చూపు

మంత్రిగా తుమ్మలకు సుదీర్ఘ అనుభవం..
తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ హయాంలో తుమ్మల మంత్రిగా పనిచేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తుమ్మల తొలిసారి 1985లో ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1985 నుంచి 1988 వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా, 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ మంత్రివర్గంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాలు శాఖల మంత్రిగా పనిచేశారు.

తొలిసారి కేబినెట్ లోకి..
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014లో తొలిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరినప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసే అవకాశం దక్కలేదు. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తొలిసారే పొంగులేటికి మంత్రి పదవి దక్కడం విశేషం.

సీనియర్ నేత భట్టి విక్రమార్క..
భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. మధిర నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009, 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009-11 వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా పనిచేశారు. 2011-14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. సుదీర్ఘకాలం తరువాత భట్టి విక్రమార్కకు క్యాబినెట్ లో చోటు దక్కింది. రేవంత్ క్యాబినెట్ లో ఉప మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో భట్టి కీలక భూమిక పోషించారు. సీఎల్పీ నేతగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై రాజీలేని పోరాటం చేశారు. పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసిన నేత భట్టి విక్రమార్క. భట్టి విక్రమార్క పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. కానీ, అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపింది.